PAN CARD ఉన్నవారికి బిగ్ అలర్ట్.. కేంద్రం కొత్త రూల్స్ అమలు.. మీపై ప్రభావం ఎలా?

PAN CARD ఉన్నవారికి బిగ్ అలర్ట్.. కేంద్రం కొత్త రూల్స్ అమలు.. మీపై ప్రభావం ఎలా?
దేశంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రతి ఒక్కరికీ PAN CARD కీలక పత్రంగా మారింది. బ్యాంక్ ఖాతా ప్రారంభించడం నుంచి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం వరకు ప్రతి పనిలో PAN అవసరం అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం PAN కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకువచ్చింది.
కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ప్రకారం కొన్ని లావాదేవీలకు PAN అవసరాన్ని తగ్గించగా, మరికొన్ని లావాదేవీల విషయంలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీంతో PAN కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మార్పుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పటివరకు బ్యాంకుల్లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే PAN వివరాలు ఇవ్వాల్సి వచ్చేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఈ పరిమితిని తొలగించారు. దీంతో చిన్న, మధ్య తరహా నగదు డిపాజిట్లకు PAN అవసరం ఉండకపోవచ్చు.
అయితే భారీ నగదు ఉపసంహరణలపై ప్రభుత్వం మరింత నిఘా పెంచింది. ఇక నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు విత్‌డ్రా చేస్తే తప్పనిసరిగా PAN వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా పెద్ద మొత్తాల లావాదేవీలపై పర్యవేక్షణ పెరగనుంది.
ఆస్తుల కొనుగోలు, అమ్మకాల విషయంలో కూడా కేంద్రం కీలక మార్పులు చేసింది. గతంలో రూ.10 లక్షల వరకు ఉన్న PAN పరిమితిని ఇప్పుడు రూ.20 లక్షలకు పెంచారు. అలాగే కొన్ని ఆస్తి లావాదేవీలకు సంబంధించిన పరిమితిని రూ.30 లక్షల నుంచి రూ.45 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు.
దీంతో రూ.45 లక్షల వరకు జరిగే కొన్ని లావాదేవీల్లో PAN అవసరం తగ్గే అవకాశం ఉంది. అయితే ఆ పరిమితిని దాటిన లావాదేవీలకు మాత్రం PAN తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఈ మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో కూడా కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఒకవేళ ప్రీమియం మొత్తం రూ.5 లక్షలు దాటితే PAN వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. PAN లేకపోతే రూ.2.5 లక్షలకు మించిన ప్రీమియం చెల్లింపుల సమాచారాన్ని బీమా కంపెనీలు ఆదాయపు పన్ను శాఖకు అందించాల్సి ఉంటుంది.
హోటల్స్, బ్యాంకెట్ హాల్స్, ఈవెంట్ బుకింగ్స్ వంటి చెల్లింపులకు సంబంధించిన పరిమితిని ప్రభుత్వం రూ.1 లక్షకు పెంచింది. అలాగే విదేశీ ప్రయాణ ఖర్చులు, విదేశీ కరెన్సీ కొనుగోళ్లు రూ.2 లక్షలు దాటితే PAN సమర్పించడం తప్పనిసరి చేసింది.
PAN కార్డు లేని వారి కోసం కూడా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న Form-60 స్థానంలో Form-97ను ప్రవేశపెట్టింది. దీంతో PAN లేని వ్యక్తులు కూడా నిర్దిష్ట లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
కొత్త నిబంధనలతో పారదర్శకత పెరగడంతో పాటు పెద్ద మొత్తాల లావాదేవీలపై పన్ను శాఖ నిఘా మరింత బలపడనుంది. అందుకే PAN కార్డు ఉన్నవారు ఈ మార్పులను తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






