అంతర్వేది రథం దగ్ధం ఘటన ప్రభుత్వ వైఫల్యమే
• గురువారం ఉదయం బిజెపీతో కలసి నల్ల రిబ్బన్లు, నల్ల బ్యాడ్జీలతో నిరసన
• నాయకులు, శ్రేణులు ఎవరి ఇళ్ళలో వారే ఉండి నిరసన తెలుపుదాం
• అంతర్వేది ఘటనపై నిరసన తెలిపిన యువకుల అరెస్ట్ అక్రమం… తక్షణమే విడుదల చేయాలి
• ముఖ్యమంత్రి స్పందించాలి… నిజనిర్ధారణ జరగాలి
• జనసేన నాయకులు, కార్యకర్తల గృహ నిర్బంధం బాధాకరం
• ప్రాంతీయ సమన్వయ కమిటీలు… తూర్పు గోదావరి జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లలో జనసేన పి.ఏ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం ఘటనకు నిరసనగా గురువారం భారతీయ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున మద్దతు తెలియచేస్తుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. బీజేపీ నాయకత్వం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారితో ఈ అంశంపై చర్చించారనీ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు గంటపాటు ఎవరి ఇళ్ళల్లో వారు నల్ల బ్యాడ్జిలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలపాలని చెప్పారు. అంతర్వేది పుణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధమైన ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుందన్నారు. ఈ ఘటనపై తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.
బుధవారం సాయంత్రం జనసేన పార్టీ పార్లమెంట్ సంయుక్త కమిటీల సమన్వయకర్తలు, సభ్యులతోనూ, అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లా పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి. భాగస్వామ్య పక్షంగా బీజేపీకి మద్దతు తెలుపుదాం. నిరసనల్లో భాగంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులను, నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. అలాగే అంతర్వేదిలో చోటుచేసుకున్న ఘటనపై నిరసన తెలిపిన యువతను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడ చోటు చేసుకున్న ఘటనపై బాధపడుతున్నవారిపైనే ఎదురు కేసులుపెట్టి అరెస్టులు చేయడం సరికాదు. ఆ సంఘటనకు బాధ్యులైనవారి గురించి విచారణపై దృష్టిపెట్టకుండా మనోభావాలు దెబ్బ తిన్నవాళ్లపై కేసులుపెడుతున్నారు. అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ అరెస్టుల విషయం, నాయకుల్ని గృహ నిర్భందంలోకి తీసుకోవడాన్ని శ్రీ పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. సమాజంలో ప్రశాంతమైన వాతావరణం రావాలని జనసేన పార్టీ కోరుకుంటుంది. వరుస సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఎందుకు వస్తుందనే అంశం మీద శ్రీ పవన్ కల్యాణ్ గారు చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాత్రి నుంచి అమలాపురం పార్లమెంట్ పరిధిలో జనసేన నాయకులు, కార్యకర్తల హౌస్ అరెస్టులు బాధాకరం. పిఠాపురం ప్రాంతంలోనూ పోలీసులు మన కార్యకర్తలు, వీర మహిళలను హౌస్ అరెస్టులు చేశారని సమాచారం వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వైఖరి ఏమిటో అర్థం అవుతోంది.
స్థానికంగా ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేసుకుంటూ అన్ని మతాలను గౌరవించుకునే విధంగానే ముందుకు వెళ్దాం. అంతర్వేది అంశంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుని, తక్షణం స్పందించి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నాలుగో ఘటన ఇది. ప్రభుత్వం విచారణ పారదర్శకంగా చేపట్టాలి. ప్రభుత్వం విఫలమైతే సీబీఐ విచారణ చేపట్టాలి అని శ్రీ పవన్ కల్యాణ్ గారు ఇప్పటికే డిమాండ్ చేశారు. ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. నిరసనలు చేపట్టే ముందు సామాజిక దూరం తప్పనిసరిగా పాటించండి.
పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు మాట్లాడుతూ.. “బాధ్యులను పట్టుకోకుండా నిరసన తెలియ చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదు. మనోభావాలు గాయపడినప్పుడు ప్రజలు నిరసన తెలుపుతారు. అది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. ఇక్కడ 30 యాక్ట్ అమలు గురించి ఆలోచించే పరిస్థితి లేదు. రేపటి నిరసనల్లో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని కూడా మనమంతా డిమాండ్ చేయాలి. మన పార్టీ మాత్రమే లౌకిక స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాం. పాలకులు కూడా అదే పాటించాలి. నాడు అశోకుడు బౌద్ధాన్ని పాటించినా మెజారిటీ శాతం హిందువులను ఇబ్బందిపెట్టలేదు. అందుకే గొప్ప పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా అశోకుడు పాటించిన స్ఫూర్తిని తెలుసుకోవాలి” అన్నారు.
శ్రీ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ “అంతర్వేది ఆలయం అగ్నికుల క్షత్రియులకు ఎంతో అనుబంధం ఉంది. ఆ ఆలయాన్ని నిర్మించింది అగ్నికుల క్షత్రియుడు శ్రీ కొప్పనాతి కృష్ణమ్మ గారు. వారి గురించి మన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిన్నటి ప్రకటనలో చాలా చక్కగా చెప్పారు. ఈ ఘటనతో అగ్నికుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నిరసనల సందర్భంగా అరెస్ట్ అయిన వారు కూడా అగ్నికుల క్షత్రియులకు చెందిన యువతే ఉన్నారు” అని తెలిపారు. డా.పి.హరిప్రసాద్ మాట్లాడుతూ “హిందూ ధర్మాన్ని పాటించేవారందరూ ఎంతో బాధపడ్డారు. టీటీడీ వ్యవహారాలు కూడా సామాన్య భక్తులను ఇబ్బందిపెడుతున్నాయి. ఆస్తులను విక్రయించాలని భావించినప్పుడు కూడా మన పార్టీ బలంగా నిరసన తెలిపింది” అన్నారు.
జనసేన అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి. హరిప్రసాద్ మాట్లాడుతూ “శ్రీ పవన్ కల్యాణ్ గారు ఇచ్చిన సందేశంలో పార్టీ విధానం ఉంది. మనకు అన్ని మతాలు సమానం. అంతర్వేదిలో జరిగింది దురదృష్టకర సంఘటన. ఆలయం, చర్చి, మసీదు ఏ ప్రార్థన మందిరానికి అపచారం జరిగినా అన్ని మతాల వాళ్లు కలిసి ఖండించాలి. జనసేన పార్టీ తీసుకునే నిర్ణయం ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. హిందూ మతం మెజారిటీ వ్యక్తులకు చెందినది కాబట్టి చాలా మంది మాట్లాడలేకపోతున్నారు. అది కరెక్టు కాదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖండించాలని మన అధ్యక్షులవారు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టే సమయంలో పార్టీ ఇచ్చే ఆదేశాలు, సూచనలు అనుసరించాలి” అన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ ల్లో పార్టీ ముఖ్య నేతలు శ్రీ కందుల దుర్గేష్, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ పంతం నానాజీ, శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ మనుక్రాంత్ రెడ్డి, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పోతిన వెంకట మహేష్, శ్రీ పరుచూరి భాస్కరరావు, శ్రీ టి.సి. వరుణ్, శ్రీ షేక్ రియాజ్, శ్రీ గాదె వెంకటేశ్వరరావు, శ్రీమతి రేఖా గౌడ్, శ్రీ మేడా గురుదత్ ప్రసాద్, శ్రీ డి.ఎం.ఆర్.శేఖర్, శ్రీ బండారు శ్రీనివాస్, శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీమతి పాముల రాజేశ్వరి, శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్, శ్రీ తుమ్మల రామస్వామి, శ్రీ రాయపురెడ్డి ప్రసాద్, శ్రీమతి మాకినీడి శేషుకుమారి, శ్రీ అత్తి సత్యనారాయణ, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, రాజోలు నియోజకవర్గం నాయకులు శ్రీ పినిశెట్టి బుజ్జి, శ్రీ గుబ్బల రవికిరణ్, శ్రీ గుండుబోగుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.