ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వ నిర్లిప్తత… కాలయాపనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి
• దుశ్చర్యలకు కారకులపై చర్యలు కోరుతుంటే… తమను అస్థిరపరచే పనులు అంటూ ప్రభుత్వం అర్థం లేని వాదన చేస్తోంది
• ‘ఛలో అంతర్వేది’ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టాలి
• జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పవిత్ర రథం దగ్ధం… అంతకు ముందు పిఠాపురం, కొండబిట్రగుంటలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలలో ప్రభుత్వం ఉదాసీనంగా, నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లే దీక్షలు చేసి భక్తులు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలియచేసే పరిస్థితులు వచ్చాయి అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలోనే అసలు దోషులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావు అన్నారు. ఎవరో మతిస్థిమితం లేనివారి చర్య అని ఉదాసీనంగా తేల్చేయడం వల్లే వరుస ఘటనలు చోటు చేసుకొంటున్నాయి అన్నారు. గురువారం ఉదయం 10గంటలకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ఇదేదో ఒక రోజులో జరిగిందో… ఒక సంఘటన గురించో చేస్తున్నది కాదు. కరోనా విపత్తు ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రజలు తమ నిరసనలు తెలియచేసేందుకు రోడ్ల మీదకు వస్తున్నారు. వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే వారి మనోభావాలు ఏ విధంగా దెబ్బ తిన్నాయో ప్రభుత్వం గ్రహించాలి. పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు ఓ మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన చర్య అన్నారు. ఆ తరవాత కొండబిట్రగుంటలో స్వామివారి రథాన్ని దహనం చేసినప్పుడూ ఓ మతిస్థిమితం లేనివారి పని అని చెప్పారు. ఇప్పుడు అంతర్వేది ఘటనలోనూ పోలీసులు నమ్మశక్యం కానీ కారణాలు చెబుతున్నారు. ఈ కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రాజకీయాలంటే ఆసక్తి లేని మహిళలు, పిల్లలు కూడా వీటిని విని విస్తుపోతున్నారు.. నవ్వుతున్నారు. మతిస్థిమితం లేనివారు కేవలం హిందూ దేవాలయాలను, రథాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. వరుసగా ఇదే తరహా ఘటనలు చోటు చేసుకొంటూ ఉంటే ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు.
శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వం ఆలయాల విషయంలో చోటుచేసుకొంటున్న దాడులు, దుశ్చర్యలపై విచారణ చేసి ఎందుకు నిందితులను పట్టుకోవడం లేదు. కాలయాపన చేస్తూ నిర్లిప్తంగా ఉండటంతో భక్తుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి. ఈ దుశ్చర్యలకు కారకులైనవారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ప్రజల మనోభావాలు గాయపడ్డాయి… ఒక పరంపరగా దుశ్చర్యలు జరుగుతున్నాయి కాబట్టే రాజకీయ పార్టీగా ఒక బాధ్యతతో స్పందించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వంలో బాధ్యత కలిగినవాళ్ళు ఇందుకు భిన్నంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని అర్థం లేని వాదన వినిపిస్తున్నారు. ఆలోచించి మాట్లాడండి. 151మంది ఉన్నారు కదా… మిమ్మల్ని ఎవరు అస్థిరతకు గురిచేస్తారు. వరుసగా చోటుచేసుకొంటున్న ఈ ఘటనలపై బలమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? భక్తుల మనోభావాలు కాపాడండి. ఒక భావోద్వేగంతో బయటకు వచ్చారు.
• ఛలో అంతర్వేది
మా మిత్ర పక్షం భారతీయ జనతా పార్టీ నాయకత్వం శుక్రవారం ‘ఛలో అంతర్వేది’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కరోనా విపత్తు సమయం ఇది… ఎంతవరకూ ముందుకు తీసుకువెళ్లాలి అని చర్చ జరిగింది. భావోద్వేగాలను, మనోభావాలను కించపరచడంతో ప్రజలే బయటకు వచ్చినప్పుడువారితో అనుసంధానం కావాలని నిర్ణయించాం. ఇందుకు జనసేన పార్టీ మద్దతు తెలియచేస్తుంది. పార్టీ నాయకులు, శ్రేణులను, వీర మహిళలను కోరుతున్నది ఒక్కటే – ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలి. మీ మనసులు గాయపడ్డాయి… ఎక్కడా భావోద్వేగాలను లోను కావద్దు. ప్రజాస్వామ్యంలో మీ నిరసన తెలియచేసే హక్కు ఉంది” అన్నారు.