ఛలో అమలాపురం నేపథ్యంలో జనసేన నేతల ముందస్తు అరెస్టులు
పలువురి గృహ నిర్భంధం
తక్షణం విడుదల చేయాలి
అంతర్వేది రథం దగ్ధం, హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు ఛలో అమలాపురంకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో జనసేన నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి ఈ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇళ్లకు వెళ్లి నోటీసులు జారీ చేయడంతోపాటు కొందరిని గృహ నిర్భంధం చేశారు.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ ను గృహ నిర్బంధంలో ఉంచారు. పోలీసులు, రోప్ పార్టీలు ఉంచి ఆయన కదలికలను నియంత్రించారు. అంతర్వేదితో పాటు పలు హిందూ ఆలయాలు, క్షేత్రాల్లో జరుగుతున్న దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాల్సి ఉండగా ఆ దాడులను నిరసిస్తూ ఉన్నవారిని అరెస్టు చేయడం గర్హనీయమని శ్రీ పోతిన వెంకట మహేష్ చెప్పారు.
అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.విజయవాడలో జనసేన పార్టీ నాయకులు శ్రీ అజయ్ వర్మ ఠాకూర్, గుడివాడ నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల ఇంఛార్జ్ శ్రీ బూరగడ్డ శ్రీకాంత్, పామర్రు నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల ఇంఛార్జ్ శ్రీ తాడిశెట్టి నరేష్, పామర్రు నియోజకవర్గం నాయకులు శ్రీ నల్లగోపుల చలపతి, అవనిగడ్డ నియోజకవర్గంలో న్యాయ విభాగానికి చెందిన శ్రీ రాయపూడి వేణుగోపాల్ తదితరులు గృహనిర్భంధం చేసిన వారిలో ఉన్నారు. కొంత మందిని గృహ నిర్భంధం చేసిన పోలీసులు, మరికొంత మందిని ముందస్తు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలిపెట్టారు.
అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులతో పాటు క్రియాశీలక కార్యకర్తలను సైతం పోలీసులు గృహ నిర్భంధం చేశారు. గోదావరి జిల్లాల్లో పలువురు జనసేన నాయకులకు, కార్యకర్తలకు అమలాపురం వెళ్ళకూడదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. తూర్పగోదావరి జిల్లాలో జనసేన నాయకులు మధు వీరేశ్, ఆర్.నాగు, పిల్లా రమ్య జ్యోతిలను గృహ నిర్బంధంలో ఉంచారు.