రైతుల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వం మాది- మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి
• తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి పట్ల అచంచల విశ్వాసం ఉన్నది
• అందుకే ఈసారి ప్రభుత్వం సూచించిన మేరకు రైతులు పంటలు వేశారు
• ఈసారి పత్తి పంట ఉత్పత్తి 60 లక్షల భేళ్ల వరకు ఉండే అవకాశం
• ఈనేపథ్యంలో జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలతో మంత్రుల భేటీ
• పరిశ్రమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రులు
• పరిశ్రమ కోరుతున్న రాయితీల పైన ముఖ్యమంత్రితో చర్చిస్తామన్న మంత్రులు
• తెలంగాణ ఉన్న మొత్తం 323 జిన్నింగ్ మిల్స్ ఉండగా 150 తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చినవే అన్న అసోసియేషన్
• ఇది ప్రభుత్వం పట్ల తమకున్న విశ్వాసాన్ని ఎత్తి చూపుతుందన్న పరిశ్రమ ప్రతినిధులు
రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయం సాగు పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈరోజు తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పత్తి పంట సాగు అవుతున్న నేపథ్యంలో జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ తో ఇరువురు మంత్రులు ఈ రోజు హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈసారి పెద్ద ఎత్తున పత్తి పంట ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలతో సిద్ధంగా ఉన్నదని మంత్రులు తెలియజేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రైతులు చేబితే విన్నారని, డిమాండ్ ఉండే వ్యవసాయ పంటలే వేశారని, ప్రభుత్వం సూచించిన సూచన మేరకు పెద్ద ఎత్తున వ్యవసాయ విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరిగిందని ఈ సందర్భంగా అన్నారు. ఇలా తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రికి చంద్రశేఖర రావు గారి పట్ల అచంచల విశ్వాసం ఉండటంవలనే ఇది సాధ్యమైందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్, ధర లభించే తీరుగా ప్రయత్నాలు ప్రారంభించిందని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలోకి నూతనంగా పెట్టుబడులు తీసుకొస్తున్న సందర్భంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిశ్రమలు, ఆయా వర్గాల పట్ల కూడా ప్రొయాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు మార్గదర్శనం చేస్తూఉంటారని, ఆ దిశగానే జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా జిన్నింగ్ మిల్స్ సమస్యలను సావధానంగా విన్న ఇరువురు మంత్రులు, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా పరిశ్రమకు రావాల్సిన రాయితీలకు సంబంధించి, ప్రస్తుతం ఉన్న సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి ఎంతో కొంత ఉపశమనం కల్పిస్తామని తెలియజేశారు. దీంతోపాటు స్పిన్నింగ్ మిల్స్ తో సమానంగా విద్యుత్ రాయితీ ఇవ్వాలన్న మరో అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిర్ణయం తీసుకుంటామన్నారు
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ఆదుకునేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నదని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అదే సమయంలో పరిశ్రమల నుంచి కూడా ప్రభుత్వానికి సహకారం కోరుకుంటామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో పెద్ద ఎత్తున పంట వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత మిల్స్ పైన కూడా ఉన్నదని మంత్రులు ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 323 జిన్నింగ్ మిల్స్ లో 150కి పైగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నెలకొల్పబడినవని, ఇది ప్రభుత్వం పట్ల తమ పరిశ్రమకు ఉన్న విశ్వాసాన్ని చూపుతుందని జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలు మంత్రులకు తెలియజేశాయి. రాష్ట్రంలో లో 60 లక్షల భేళ్ళ పంట దిగుబడి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని, రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్స్ పరిశ్రమ ప్రాసెసింగ్ సామర్ధ్యం కోటి భేళ్ళ వరకు ఉన్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పిలిచి తమ సమస్యలను సానుకూలంగా వినడం పట్ల హర్షం వ్యక్తం చేసిన అసోసియేషన్, కేంద్రస్ధాయిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కావాల్సిన సహకారానికి సంబంధించిన తమకు సహాయం చేయాలని కోరారు. జిన్నింగ్ మిల్స్ పరిశ్రమకు కావలసిన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని ఈ విషయంలో ఇలాంటి బెంగ అవసరం లేదని మంత్రులు వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.