వైయస్ఆర్ ఆసరా వారోత్సవాలను విజయవంతం చేయాలి
ప్రతి వార్డు సెక్రటేరియట్ లోనూ ప్రారంభోత్సవ వేడుకలు
డ్వాక్రా సభ్యుల ఆర్ధిక పురోభివృద్ధికే ఆసరా
పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
**
విజయవాడ : డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలకు తోడ్పాటు నందించేందుకు ఈ నెల 11 వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభించనున్న వైయస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అర్హులైన అందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.
పురపాలక సంస్థలకమిషనర్లు, మెప్మా ,ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులతో బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, రాష్ట్ర కమిషనర్ విజయకుమార్, మెప్మా ఎండి విజయలక్ష్మి, ఇంజనీరింగ్ ఛీప్ చంద్రయ్య తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళల సంక్షేమానికి చేస్తున్న అన్ని కార్యక్రమాల అవగాహన కల్పిస్తూ, ప్రజాప్రతినిధులందరితో సమన్వయం చేసుకుంటూ ఈ నెల 11 నుంచి 17 వరకు ఆసరా వారోత్సవాలను నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
పట్టణ ప్రాంతాల్లోని సుమారు 1.52 లక్షల స్వయం సహాయక సంఘాలకు మొదటి విడతలో సుమారు రూ.1186 కోట్లు, ఆసరా ద్వారా లబ్ధి చేకూరనున్నదని ఆయన తెలిపారు. ఈ విధంగా అందచేస్తున్న మొత్తాన్ని, బ్యాంకులు పాత బకాయిలుగా జమ చేసుకోకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
ఇది స్వయం సహాయక బృందాల అక్కచెల్లెమ్మల కుటుంబాల స్వయం సమృద్ధి, ఆర్ధిక పురోభివృద్ధికి దోహదకారి కావాలన్నది ముఖ్యమంత్రిగారి సంకల్పమన్నారు. ఈ నెల 11 వ తేదీన ఆసరా కార్యక్రమ ప్రారంభోత్సవ వేడుకలను ప్రతి వార్డు సెక్రటేరియట్ లోనూ నిర్వహించాలన్నారు.
త్వరలో ప్రారంభం కానున్న జగన్న తోడు పథకం పై కూడా సమీక్షించారు. నాడు నేడు కింద పురపాలక పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తూ, నిర్ణీత కాలపరిమితిలోగా ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా, ఇంజనీర్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. టిడ్కో ఆధ్వర్యంలోని గృహాల లబ్ధిదారుల జాబితాలను మరోసారి సరిచూసుకోవాలని సూచించారు. 365, 430 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న గృహాల లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా సమన్వయం చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు నిర్దేశించారు.
38 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిథిలోని స్మశానాల్లో చేపట్టిన 41 విద్యుత్ / గ్యాస్ దహనవాటికల ఏర్పాటు తదితర పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, వీటన్నిటిని త్వరితగతిన పూర్తి చేసేలా కమీషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
సుమారు 3 గంటలపాటు జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్సులో పారిశుద్ధ్యం, వార్డు సెక్రటేరియట్ ల పనితీరు తదితర అంశాలను కూడా సమీక్షించారు.