రాష్ట్రంలోని ఎమ్మార్వోలందరినీ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు

రాష్ట్రంలోని ఎమ్మార్వోలందరినీ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు
Spread the love

★ జాయింట్‌ రిజిస్ట్రార్లుగా
ఎమ్మార్వోలు

★ వ్యవసాయేతర భూముల
బాధ్యత సబ్‌ రిజిస్ట్రార్లకు

★ రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌,
అప్‌గ్రెడేషన్‌ అన్నీ ఒకేసారి

★ అసెంబ్లీలో ముఖ్యమంత్రి
కేసీఆర్‌ వెల్లడి

రాష్ట్రంలోని ఎమ్మార్వోలందరినీ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ తాసిల్దార్‌గా, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా కూడా రెండు విధులనూ నిర్వహిస్తారని తెలిపారు. నూతన రిజిస్ట్రేషన్‌ విధానంపై సీఎం కేసీఆర్‌ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..

పక్కాగా పని విభజన

ప్రభుత్వానికి సెక్షన్‌ 7 అధికారాల మేరకు ఎంఆర్‌వోలందర్నీ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా చేస్తున్నం. రెండు పనులు ఆయనే చేస్తడు. 590 మండలాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక, మొన్న చేసిన ధూళిమిట్ట కలుపుకొంటే 130 మండలాలు కొత్తగా ఏర్పాటు చేశాం. ఈ మండలాల్లో ఉన్న ఎమ్మార్వోలు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లు అవుతారు. వ్యవసాయ భూములు వీళ్లు రిజిస్ట్రేషన్‌ చేస్తే, వ్యవసాయేతర భూములు ఇప్పుడున్న సబ్‌ రిజిస్ట్రార్లు చేస్తరు. ఇప్పుడు 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అలాగే కొనసాగుతాయి. దానికి సంబంధించి మున్సిపల్‌, పంచాయతీ శాఖల మంత్రులు సవరణచేస్తున్నరు.

మ్యుటేషన్‌ వేరే దగ్గర ఎందుకు?

రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు వెళ్తున్నం. మళ్లీ మ్యుటేషన్‌కు ఇంకోకాడికి ఎందుకు సార్‌? అని రైతులు అంటున్నరు. తిరగటం ఎందుకు అనే భావన ప్రజల్లో ఉన్నది. చాలామంది నిపుణులు, విద్యావంతులు ఇదే అభిప్రాయపడ్డారు. రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1908 బ్రిటిష్‌ వాళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అదే అమలవుతున్నది. ఇందులో ఉన్న సెక్షన్‌ 7 కింద విశేషమైన అధికారాలు రాష్ర్టాలకు ఇచ్చారు. జిల్లా రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్లను ఎవరినైనా నియమించే అధికారమున్నది. ప్రభుత్వాధికారులే కానవసరం లేదు. అంత పవర్‌ ఇచ్చారు. దాన్ని మేం రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ విషయంలో వినియోగించుకుంటున్నం.

వ్యవసాయ భూమికి లెక్కలున్నయి

మొన్ననే రూ.7,270 కోట్లు రైతుబంధు కింద ఇచ్చాం. ఇందులో ఎలాంటి వివాదం లేదు. అతి కొద్ది మంది మినహా 99% మందికి అందింది. ఇలా వ్యవసాయ భూముల లెక్క మన దగ్గర పక్కాగా ఉన్నది. కొత్తగా వివాదం ఉంటే పరిష్కారం అవుతుంది. వ్యవసాయేతర భూములు కావొచ్చు, ప్రాపర్టీస్‌ కావొచ్చు.. అంటే గ్రామ కంఠంలోపల ఉండే ఆస్తులు, మున్సిపల్‌ పట్టణాల్లో ఉండే ప్లాట్లు కావొచ్చు, ఫ్లాట్స్‌ కావొచ్చు.. ఇండ్లు కావొచ్చు లేదా కంపెనీలు, పరిశ్రమల కింద ఉండే భూములు కావొచ్చు.. ఇలాంటివన్నీ వ్యవసాయేతర భూములుగా పరిగణించబడతాయి. వీటన్నింటినీ సబ్‌ రిజిస్ట్రార్లే మార్పులు చేర్పులు చేస్తరు. ఈ రికార్డులు మన దగ్గర ఉన్నయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకొనేందుకు ఇటీవల నేను నలుగురైదుగురు గ్రామ కార్యదర్శులతో మాట్లాడాను. ప్రస్తుతం ఈ ఆస్తులకు సంబంధించి మ్యుటేషన్‌ గ్రామాల్లో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో జీహెచ్‌ఎంసీ చేస్తున్నాయి. వివరాలు అప్‌డేట్‌గా ఉన్నయి.

రిజిస్ట్రేషన్ల ఆధారంగానే ఆస్తుల మ్యుటేషన్‌

వీళ్లు అవలంబిస్తున్న పద్ధతి ఇప్పటికైతే.. ముందుగా ఇల్లు కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు పోతరు. వాళ్లు చెల్లించిన ఫీజుల్లో రిజిస్ట్రేషన్‌ ఫీజు పోను పంచాయతీకి, మున్సిపాలిటీ, జీహెచ్‌ఎంసీ ఫీజులు ఆన్‌లైన్‌లో బదిలీ అవుతయి. దీంతోపాటు సమాచారం కూడా ఆన్‌లైన్‌లో ప్రతిరోజూ అప్‌డేట్‌ అవుతుంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ వాళ్లు ఎలాంటి విచారణ చేయకుండానే కేవలం రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లపై మ్యుటేషన్‌, మార్పులు చేర్పులు చేస్తున్నరు. ఒక్క మ్యుటేషన్‌ మాత్రమే కాదు, ఇంటికి కరెంటు కనెక్షన్‌, నీటి కనెక్షన్‌ బిల్లులు, ఆధార్‌కార్డు, టెలిఫోన్‌ ఇతరత్రా అన్నింటితో వాళ్లకు రక్షణ ఉంటుంది.

అంతా ఆన్‌లైన్‌లోనే

గ్రామ పంచాయతీల పరిధిలో ఇండ్లున్నవి. అవి గ్రామకంఠాల్లో ఉంటయి. వాటిని ఆబాదీలు అంటరు. ఈ రకంగా 44.28 లక్షల ఆస్తులు ఉన్నయి. పంచాయతీరాజ్‌శాఖ వాళ్లు 95 శాతానికిపైగా ఆన్‌లైన్‌చేశారు. మున్సిపాలిటీల్లో 20.29 లక్షల ఆస్తులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24.90 లక్షల ఆస్తులు వ్యక్తుల పేరుమీద ఉన్నయి. ఇలా రాష్ట్రంలో మొత్తం 89.47 లక్షల ఆస్తులు ఆన్‌లైన్‌లో ఉన్నయి. ఈ వివరాలన్నీ ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తయి. ప్రజలు ఏ వివరాలైనా ఆన్‌లైన్‌లో సులువుగా చూసుకోవచ్చు. ఉదాహరణకు.. మధిర మున్సిపాలిటీలో ఫలానా ఇల్లు ఎవరి పేరు మీద ఉన్నదని కంప్యూటర్‌లో చూస్తే వెంటనే వస్తది. ప్రజలు ఇండ్లు కొనాలన్నా ఆన్‌లైన్‌లో వివరాలు చూసుకోవచ్చు. ఎక్కడికీ తిరిగే అవసరం లేదు.

సబ్‌ రిజిస్ట్రార్లకే మ్యుటేషన్‌ అధికారాలు

రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వ్యవసాయ భూముల జోలికి పోకుండా వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తయి. మ్యుటేషన్‌ అధికారాలు కూడా వారికే ఇస్తున్నం. అక్కడే రిజిస్ట్రేషన్‌ చేస్తరు.. మ్యుటేషన్‌ చేస్తరు.. కాగితం ఇస్తరు. ఇగ వేరే కార్యాలయానికి పోయే పనిలేదు. వ్యవసాయ భూములు కూడా ఇంతే. ఇష్టమున్నట్లు చేసేది లేదు. నా ఇష్టమున్నప్పుడు, నా దయ ఉన్నప్పుడు అన్నట్టు చేసేది లేదు. ఇక అట్ల నడవదు.

ముందుగా స్లాట్‌ బుక్‌చేసుకోవాలి

ఉదాహరణకు.. ఒక భూమిని ఒక వ్యక్తి అమ్మిండు.. ఇంకొకరు కొన్నరు. వాళ్లిద్దరు కలిసి బేరం మాట్లాడుకుంటరు. ఒప్పందం కుదిరిన తర్వాత జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కమ్‌ ఎమ్మార్వో దగ్గరకు పోతరు. మాకు రిజిస్ట్రేషన్‌ కోసం టైం కావాలని అడుగుతరు. ఆయన కచ్చితంగా సమయం కేటాయించి ఎప్పుడు చేస్తమనేది చెప్తరు. ఆయన వీలును బట్టి టైం అలాట్‌ చేస్తరు. అలాట్‌చేసిన సమయానికి వెబ్‌సైట్‌లో నమోదుచేస్తరు. సబ్‌ రిజిస్ట్రార్‌, ఎమ్మార్వో కార్యాలయాల్లో హార్డ్‌కాపీలతోపాటు లాగ్‌ రిజిస్టర్‌ కూడా పెడుతున్నం. ఎప్పుడు ఎవరికి రిజిస్ట్రేషన్‌ కోసం టైం ఇచ్చిందనే వివరాల్ని అందులో కూడా ఎంట్రీచేయాలి. వచ్చేవారం ఎవరెవరి రిజిస్ట్రేషన్లు ఉన్నాయనేది లాగ్‌బుక్‌తోపాటు వెబ్‌సైట్‌లో కూడా ఉంటుంది.

ఇన్‌స్టంట్‌ రిజిస్ట్రేషన్‌.. ఇన్‌స్టంట్‌ మ్యుటేషన్‌

ఉదాహరణకు నేను, మహమూద్‌అలీ ఉన్నం. నాకో పదెకరాలు ఉన్నది. రెండెకరాలు మహమూద్‌ అలీకి అమ్ముతున్న. మేం ముందుగా రిజిస్ట్రేషన్‌ కోసం ఎమ్మార్వో దగ్గర సమయం తీసుకుంటం. అక్కడ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మమ్మల్ని ‘మీకు డబ్బులు ముట్టినయా? డాక్యుమెంట్లు సిద్ధమైనయా?’ అని అడుగుతరు. మేం అప్పటికి అన్నీ సిద్ధంగా ఉంచుకుంటం. వాటిని కంప్యూటర్‌లో చూసి పరిశీలిస్తరు. వీటిని రిజిస్ట్రేషన్‌ చేయవచ్చా? లేదా అన్‌లాక్‌లో ఉందా? అని చూస్తరు. ఫీజును చలానా రూపంలోగానీ నగదు రూపంలోగానీ తీసుకొని వెంటనే రిజిస్ట్రేషన్‌ చేస్తరు. నేను రెండెకరాలు అమ్మినందున వెంటనే నా పాస్‌పుస్తకంలో ఆ రెండెకరాల్ని తొలిగిస్తరు (డిలీట్‌ చేస్తరు). ఇయ్యాల బ్యాంకుకుపోతే ఆటోమెటిక్‌గా ఎలా పాస్‌పుస్తకాలపై వివరాలిస్తున్నరో అట్లనే ఇక్కడ కూడా వెనువెంటనే నా పాస్‌పుస్తకంలో రెండెకరాలు డిలీట్‌ చేసి మహమూద్‌ అలీ పాస్‌పుస్తకంలో ఎక్కిస్తరు. మ్యుటేషన్‌ అధికారాలు ఆర్డీవోలకు తొలిగించి, ఎమ్మార్వోలకు ఇస్తున్నం. ఆ తర్వాత వెంటనే మ్యుటేషన్‌ ఫారాల మీద కూడా సంతకాలు తీసుకొని మ్యుటేషన్‌ చేస్తరు. దీని తర్వాత అక్కడే సిద్ధంగా ఉన్న ఐటీ టేబుల్‌ (టీఎస్‌ టెక్నాలజీ ఆధ్వరంలోనిది) మీద ఉన్న వ్యక్తి వెంటనే దానిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌చేస్తరు. ఇద్దరం అక్కడ ఉండగానే అప్‌లోడ్‌ చేసి ఆ కాపీని కూడా మాకిస్తరు. ఇట్ల నిమిషాల వ్యవధిలోనే ఇదంతా యావత్‌ ప్రపంచానికి తెలిసిపోతది. ఫలానా వాళ్లు భూమి అమ్మినరు, ఫలానా వాళ్లు భూమి కొన్నరు, మ్యుటేషన్‌ అయిపోయిందని తెలుస్తది. వెంటనే కొన్నవాళ్లకు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, పాస్‌ పుస్తకం, ఎక్స్‌ట్రాక్ట్‌ కాపీ ఇస్తరు. అమ్మినవాళ్లకు పాస్‌పుస్తకం, ధరణి కాపీ ఇస్తరు. ఇక దరఖాస్తు లేదు.. దఫ్తరు లేదు.. రశీదు లేదు.. ఎక్కడికి పోయే అవసరం లేదు. సంతోషంగా ఎవరింటికి వాళ్లు పోవచ్చు. ఇదంతా చాలా బ్రహ్మాండంగా ఉంటది. అనేకమంది నిపుణులు, ఐటీ వాళ్లతో మాట్లాడినం. చాలా బాగుంది. ప్రపంచంలో ఎక్కడా లేదు, మంచి సాఫ్ట్‌వేర్‌ ఉన్నదని చెప్పినరు.

ఇష్టముంటేనే డాక్యుమెంట్‌ రైటర్ల దగ్గరకు..

రిజిస్ట్రేషన్‌, ఎమ్మార్వో కార్యాలయాల్లో రెండింట్లో మంచి వసతి పెడుతున్నం. భూమి అమ్మేవాళ్లు, కొనేవాళ్లు మంచిగ చదువుకున్నట్లయితే వాళ్లకు డాక్యుమెంట్‌ రైటర్‌ అవసరం లేదు. మేమే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు రాసుకుంటమంటే రాసుకోవచ్చు. ఆ నమూనా పత్రాలు (టెంప్లేట్లను) ను అక్కడ అందుబాటులో ఉంచుతం. ప్రభుత్వమే నామమాత్రపు రుసుముతో వాటిని ఇస్తుంది. మాకెందుకు ఇదంతా అనుకుంటే.. అక్కడ ప్రభుత్వ లైసెన్సు ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లను కూడా పెడతం. ఇప్పటికే ప్రభుత్వ లైసెన్సు ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నరు. వాళ్ల పొట్ట కొట్టదలచుకోలేదు. వాళ్లు కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం ఫీజు తీసుకుంటరు. అమ్మకం, కొనుగోలు చేసుకుంటున్న వ్యక్తులు ముందుగా నిర్ణయించిన సమయానికి పోయి, అవసరమైతే డాక్యుమెంట్‌ రైటర్లతో వాటిని తయారు చేయించుకోవచ్చు. లేకపోతే సొంతంగా చేసుకుంటే ఎవరికీ నయాపైసా ఇయ్యాల్సిన పనిలేదు

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *