వీఆర్‌ఏలకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రవ్యాప్త వీఆర్‌ఏలకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. పే స్కేల్ అమలులో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వాళ్లే ఉద్యోగం తీసుకోవచ్చు. లేదంటే కుటుంబంలోని వారసులకు ఇయ్యండంటే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. నూతన రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా సీఎం శాసనసభలో మాట్లాడారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ వీఆర్‌ఏ ఉద్యోగాలపై ఈ ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తనకు బాగా నచ్చింది, మానవతాకోణం ఉన్న అంశం వీఆర్‌ఏలు అన్నారు. తరాలుగా వారు సమాజానికి ఎంతో సేవ చేశారన్నారు. చెరువుల కింద జమాబందీ అయితేనేం, బందోబస్తు అయితేనేం, నీళ్లు పారించింది కూడా వాళ్లే అన్నారు. కష్టపడ్డరు, గ్రామానికి సేవకులుగా పనిచేసిన్రు. కాబట్టి సమాజానికి వాళ్లపట్ల కూడా బాధ్యత ఉండాలన్నారు.
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వీళ్లలో ఎక్కువశాతం వీకర్ సెక్షన్‌వారే ఉన్నారు. ఇన్నేళ్ల నుంచి కూడా చాలా తక్కువ జీతంతో పనిచేశారు. రూ 200 కానుంచి పనిచేశారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వారికి రూ 10 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఉన్నోళ్లకు ఏజ్ లిమిట్ పెట్టలేదు. 70 ఏళ్ల ఆయన కూడా పనిచేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా వీళ్లు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో వారు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు ఎవరికైనా వీఆర్‌ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మానవతా దృక్పథంతోని ఇస్తామని ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు.