భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు మళ్లించేందుకు ప్రభుత్వానికి ఏ అధికారం ఉంది?
రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులుపడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం వారికి సంబంధించిన సంక్షేమ నిధి నుంచి నిధులను మళ్లిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 22 లక్షల మంది రిజిస్టర్డ్ నిర్మాణ కార్మికులు ఉన్నారు. మొదట ఇసుక కొరత తలెత్తింది. తరువాత కోవిడ్ 19 పరిస్థితులు వచ్చాయి. ఫలితంగా ఉపాధి కరవైంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కిన సాయం శూన్యం. ఆ కార్మికులను పట్టించుకోలేదు. భవన కార్మికుల బాగోగులను ప్రభుత్వం చూసుకోవాల్సి ఉండగా – అందుకు భిన్నంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ నిధులను మళ్లించింది. ఆ నిధి నుంచి రూ. 450 కోట్లు మొత్తాన్ని వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం తన సొంత అవసరాలకు కోసం మళ్లించింది. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్‌ను కూడా సంప్రదించకుండా 450 కోట్ల రూపాయల నిధులను మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అధికారం ఉంది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. కార్మికుల హక్కులను కాలరాయడమే. కార్మిక చట్టాల ఉల్లంఘనే. ఈ అంశంపై వైసిపి ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
- పవన్ కల్యాణ్
అధ్యక్షులు, జనసేన