ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా హైదరాబాద్ నగరం అవతరిస్తోందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాసనసభలో మంత్రి కేటీఆర్ స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో అత్యంత వేగంగా పట్టణీకరణ చెందిందని తెలిపారు. తెలంగాణ పట్టణీకరణ 42.6 శాతానికి చేరుకుంది. దేశ సగటు పట్టణ జనాభా 31.2 శాతం మాత్రమే. తెలంగాణలో అనేక పాలన సంస్కరణలను చేపట్టింది. పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా 74 కొత్త మున్సిపాలిటీలు, 7 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. రాష్ర్టంలో 142 పురపాలికలకు రూపకల్పన జరిగింది. ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తూ ఉపాధి కల్పనను పెంపొందిస్తున్నాం.
కట్టుదిట్టమైన శాంతి భద్రతలను అమలు చేస్తున్నాం. ఈ క్రమంలో ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా హైదరాబాద్ అవతరిస్తోందన్నారు. ప్రతి నెల జీహెచ్ఎంసీకి రూ. 78 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ. 70 కోట్లు విడుదల చేస్తున్నాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ. 67 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్‌ది కీలక పాత్ర అని స్పష్టం చేశారు.
నగరంలో అనేక నూతన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించామన్నారు. రాబోయే రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తామని తెలిపారు. అన్ని పురపాలికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.
రూపాయికే ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తున్నామని తెలిపారు. లాక్డౌన్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశామని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. నూతన మున్సిపల్ చట్టం ద్వారా అనుమతులను సులభతరం చేశామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో డీఆర్ఎఫ్ బృందాలను రాష్ర్టంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు.
బస్తీల్లో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.