ఏపీలో 1.87 లక్షల మందికి వ్యాక్సిన్
అమరావతి : రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోంది. జనవరి 31 నాటికి 1,87,252 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ లబ్ధిదారుల సంఖ్యలో 9వ స్థానంలో ఏపీ ఉంది. అయితే జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల పరంగా చూస్తే మన రాష్ట్రం పెద్ద రాష్ట్రాల కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసింది. జనాభా ప్రాతిపదికన ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాల్లో రాష్ట్రం 5వ స్థానంలో నిలిచింది. దేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 4,63,793 మందికి వ్యాక్సిన్ వేయగా అత్యల్పంగా డామన్ అండ్ డయ్యూలో 391 మందికి వేశారు. పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు అత్యల్పంగా 1.05 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసింది. జనవరి 31 రాత్రి 9 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 37,58,843 మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.