*ఐటిఐఆర్ హైదరాబాద్ కు తేలేని బీజేపీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్
* దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ మూలకు పెట్టింది బీజేపీ ప్రభుత్వమే
* కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు విస్పష్టమైన ప్రకటన చేశారు
* సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ప్రకటన గురించి సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనం
* కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బెంగళూరు లాంటి పట్టణంలోనూ ఐటీఐఆర్ ఒక అడుగు ముందుకు పోలేదు
* మరి అక్కడ ఐటిఐఆర్ ప్రాజెక్టు రానందుకు కూడా మా ప్రభుత్వమే కారణమెనా అని ప్రశ్నించిన కేటీఆర్
* 2014 నుంచి రాసిన లేఖలు మరియు సమర్పించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులన్ని బండి సంజయ్ కి ఇస్తాం, ఐటిఐఆర్ తీసుకొచ్చే దమ్ము ఉందా
* ఐటిఐఆర్ విషయంలో వెనక్కి పోయిన బీజేపీ నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలి
* రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఐటీఐఆర్ ప్రాజెక్టు పైన కేంద్రం నుంచి ఒక ప్రకటన ఇప్పించాలి
* బండి సంజయ్ కి దమ్ముంటే ఐటిఐఆర్ లేదా ఐటిఐఆర్ కి సమానమైన మరో ప్రాజెక్టుని హైదరాబాద్ నగరానికి తీసుకురాగలరా
* కేవలం మీడియాలో ప్రచారం కోసం అసత్యాలతో బండి సంజయ్ లేఖ రాశారు
* బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర
సిగ్గులేకుండా అసత్యాలు, అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బయటపడింది ఐటీఐఆర్ గురించి నిన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధిని పణంగా పెట్టి ఐటిఐఆర్ ని రద్దు చేసిన కేంద్రంలో ఉన్న తన సొంత ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పలుమార్లు పార్లమెంట్ సాక్షిగా ఐటిఐఆర్ ని రద్దు చేస్తున్నామని ప్రకటించిన కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ కి లేఖ రాసి నిజాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, బండి సంజయ్ కి హితవు పలికారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎంతటి అబద్ధాలు నైనా మాట్లాడే నైజం బీజేపీ ది అని, మరోవైపు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఐటీఐఆర్ కోసం తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని కేటీఆర్ అన్నారు. జూన్ 2014 లో అంటే తెలంగాణ వచ్చిన మొదటి నెలలోనే ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఐటీఐఆర్ పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి లేఖ రాశారన్నది వాస్తవం అన్నారు. మళ్లీ 2014 సెప్టెంబర్ లో పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమొరాండం సమర్పించామని, దీంతోపాటు అనేకసార్లు ప్రధానికి, కేంద్ర ఐటి శాఖ మంత్రికి విజ్ఞప్తులు తమ ప్రభుత్వం తరఫున స్వయంగా తానే అందించానని కేటీఆర్ తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన ఐటీఐఆర్ అమలు కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణం అనడం విచిత్రం, విడ్డూరం, పచ్చి అబద్దం అన్నారు. ఒక్క తెలంగాణ లోనే కాదు, ఐటీఐఆర్ మంజూరు అయిన ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఆ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అన్న సంగతి తెలియకపోవడం తెలంగాణ బీజేపీ అధ్యక్షుని అజ్ఞానాన్ని సూచిస్తుందన్నారు.
అటు కేంద్ర ప్రభుత్వంలో… ఇటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బెంగళూరు ఐటీఐఆర్ ప్రాజెక్టులో ఒక తట్టెడు మట్టి కూడా లేవలేదు అన్న వాస్తవం స్వీకరించాలని కేటీఆర్ తెలిపారు. బెంగళూరులో, ఆంధ్రప్రదేశ్ లో, ఒరిస్సా లోని భువనేశ్వర్ లో ఐటిఐఆర్ మొదలు కాకపోవడానికి కూడా కారణం కేసీఆర్ గారి ప్రభుత్వమేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఐటిఐఆర్ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడనికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అని, ముందుగా ఆ విషయాన్ని గుర్తించాలన్నారు. మీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అనేక పర్యాయాలు ఐటీఐఆర్ ప్రాజెక్టును కొనసాగించే ఉద్దేశం లేదు అని బహిరంగ ప్రకటనలు చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవాలను దాచిపెట్టి, రాష్ట్ర ప్రభుత్వం మీద అభాండాలు వేయడానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, అసమర్థత, ఐటీ రంగం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే దేశ వ్యాప్తంగా ఐటిఐఆర్ ప్రాజెక్ట్ మూలన పడటానికి ప్రధాన కారణం. దానిని కప్పిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం వేయడం దుర్మార్గం అన్నారు. అటు ఐటీఐఆర్ ఉసురు తీసింది మీ పార్టీ అని, ఇక్కడ ఉత్తరాల పేరుతో డ్రామాలు ఆడుతుందీ మీరే అని మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
ఉన్న ఐటీఐఆర్ ను మూలకు పెట్టిన బీజేపీ ప్రభుత్వం, గత ఐదేళ్ల పాలనలో ఐటీ రంగ అభివృద్ధికి ఒక్కటంటే ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రకటించకుండా భారతదేశ ఐటీ రంగం పై సమ్మెట పోటు వేసింది నిజం కాదా అన్నారు. ఐటీఐఆర్ వస్తే కొత్తగా కొలువులు వస్తాయని యువకులు, నిరుద్యోగులు పెట్టుకున్న కోటి ఆశలపై నీళ్లు చల్లింది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అని, ఈ విషయాన్ని తెలంగాణలోని ప్రతి ఒక్క విద్యావంతునికి తెలుసన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన నివేదికలు లేకపోవడం ద్వారానే ఐటిఐఆర్ ప్రాజెక్టు ఆగింది అని అంటున్న ఎంపీ బండి సంజయ్ కళ్ళు ఉన్న నిజాలు చూడాలేని గుడ్డివాడి లాంటివాడు అన్నాడు. రాష్ట్ర ఐటీ మంత్రిగా తానే స్వయంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ విషయంపై పలుమార్లు కలిసింది వాస్తవం, లేఖలు రాసింది వాస్తవమని, గత ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సార్లు ITIR సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లు, మెమొరాండంలు సమర్పించింది వాస్తవం అన్నారు. కానీ వాస్తవాలను దాచిపెట్టి, నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ హైదరాబాద్ ఐటిఐఆర్ ప్రాజెక్ట్ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ” ఉల్టా చోర్ కోత్వల్ కో డాంటే” అన్నట్టు గా ఉందన్నారు. బండి సంజయ్ చేతనైతే ఐటీఐఆర్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలన్నారు. కేవలం హైదరాబాద్ లో మీడియాలో ప్రచారం కోసం లేఖలు కాకుండా కేంద్రం నుంచి ఐటీఐఆర్ కు సంబంధించి ఒక ప్రకటన లేదా స్పష్టత ఇప్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి రాసిన లేఖ లతోపాటు ఇచ్చిన డిపిఆర్ రిపోర్టులు అన్నింటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో ఐటీఐఆర్ ప్రాజెక్టు లేదా ఐటిఐఆర్ కు సమానమైన ఇతర హోదాను/ ప్రాజెక్టుని హైదరాబాద్ కి ప్రత్యేకంగా తీసుకురావాలని సూచించారు. అటు సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేక కేవలం అసత్యాలు, అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూసే బండి సంజయ్ ప్రయత్నాలు ఎన్నడు సఫలం కావన్నారు. ఇప్పటికైనా ఐటీఐఆర్ ను రద్దు చేస్తామని ప్రకటించిన తమ సొంత పార్టీ కి చెందిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటనను మరోసారి చదువుకొని తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగర యువత కి ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.