ముఖ్యమంత్రికి మహిళల రక్షణ పట్ల బాధ్యత లేదు
ముఖ్యమంత్రికి మహిళల రక్షణ పట్ల బాధ్యత లేదు
• వైసీపీ ప్రభుత్వం చేసిన దిశ చట్టానికి కోరలు లేవు
• గన్ కంటే ముందు జగన్ వస్తాడన్న వైసీపీ నేతలు సీతానగరం అత్యాచార ఘటనపై మాట్లాడరేం?
• ముఖ్యమంత్రి ప్యాలెస్ కి సమీపంలో అత్యాచారం జరిగితే స్పందనేది?
• బెజవాడలో బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి
• జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి మహిళల రక్షణ పట్ల బాధ్యత లేదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారి తాడేపల్లి ప్యాలెస్ కి కిలోమీటర్ దూరంలో ఓ మహిళపై అత్యాచారం జరిగితే ఆయన నుంచి కనీస స్పందన కరువయ్యిందన్నారు. దిశ చట్టం చేశాం.. గన్ కంటే ముందు శ్రీ జగన్ వచ్చేస్తారని ఆ పార్టీ నేతలు చెప్పిన మాటలు, చేసిన ప్రచారం ఏమయ్యాయని ప్రశ్నించారు. సోమవారం జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వీడియో ద్వారా స్పందించారు.
ఈ సందర్భంగా శ్రీ మహేష్ మాట్లాడుతూ “దిశ చట్టం గురించి ఆర్భాటాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎక్కడ? ముఖ్యమంత్రి గారి నివాసానికి సమీపంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారుగానీ, మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ ఎందుకు స్పందించలేదు. రాష్ట్రానికి హోమ్ మంత్రి శ్రీమతి సుచరిత ఈ ఘటనపై తక్షణమే ఎందుకు స్పందించలేదు. కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించ లేదు. ఇంత దారుణమైన ఘటన జరిగితే మహిళా కమిషన్ ఛైర్మన్ స్పందించరా? ఆ కుటుంబాన్ని పరామర్శించరా? అని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం.
• దిశ చట్టం ప్రచారార్భాటమే
వైసీపీ ప్రభుత్వం చేసిన దిశ చట్టానికి కోరలు లేవు. ఇది కేవలం ప్రచార ఆర్భాటం కోసం చేసుకున్న చట్టం మాత్రమే. దిశ చట్టం చేశాక రాష్ట్రంలో జరిగిన అత్యాచారాల మీదగానీ, అఘాయిత్యాల మీద గానీ, ఉన్మాదులు చేస్తున్న దాడుల మీద గానీ ఏ ఒక్క కేసులో అయినా కఠినంగా శిక్షించారా? శిక్షించిన దాఖలాలు ఉంటే సాక్ష్యాలు చూపించండి.. ఈ అంశంపై వైసీపీ నాయకులు స్పందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల గౌరవం లేదు. మహిళల రక్షణ పట్ల బాధ్యత లేదని చెప్పడానికి తాడేపల్లి సమీపంలో ఘటన పట్ల ఆయన వ్యవహరించిన తీరే నిదర్శనం. మీకు మహిళల మీద నిజంగా గౌరవం ఉంటే, వారి రక్షణ పట్ల బాధ్యత ఉంటే తక్షణం స్పందించే వారు. సీతానగరంలో అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తుల మీద చర్యలు తీసుకునే వారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసే దిశగా అడుగులు వేసేవారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి గారి నుంచి కనీస స్పందన కరువయ్యిందన్న అంశాన్ని రాష్ట్రంలో ఉన్న మహిళలంతా గ్రహించాలని జనసేన పార్టీ తరఫున మనవి చేస్తున్నాం.
• మీ చట్టాలు పనికొచ్చేవి కాదు
మహిళల పట్ల గౌరవం లేదు. మహిళల రక్షణ పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదని చెప్పడానికి గడచిన నాలుగైదు రోజుల్లో జరిగిన సంఘటనలే నిదర్శనం. కడప జిల్లాలో శిరీష అనే యువతి ప్రేమ నిరాకరించిందని ఓ యువకుడు గొంతు కోసి చంపిన ఘటన.. మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాలో ఫోన్ నంబర్ ఇవ్వలేదని ఓ యువతి కుటుంబంపై కాల్పులకు పాల్పడిన ఘటన చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె. రోజా గారు సినిమా డైలాగులు బాగా చెబుతారు. దిశ చట్టం పెట్టాం.. గన్ కంటే ముందు జగన్ గారు వచ్చేస్తారని చెప్పారు. మరి చిత్తూరు జిల్లా బైర్రెడ్డిపల్లిలో జరిగిన ఘటన మీద కనీసం రోజా గారు అయినా ఎందుకు మాట్లాడలేదు? మీరు చేసిన చట్టాలు కేవలం ప్రకటనలకు తప్ప ప్రజలకు పనికొచ్చే విధంగా ఎక్కడా చేయలేదు.
• డీజీపీ గారూ… మీ అవార్డులు షో కేసుల్లో పెట్టుకోండి
రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు మాకు బెస్ట్ పోలీసింగ్ లో అవార్డులు వచ్చాయి.. మేము బాగా పని చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. మీకొచ్చిన షీల్డులు షో కేసుల్లో పెట్టుకుని చూసుకోండి. అంతకు మించి ఇలాంటి అఘాయిత్యాల నుంచి కాపాడడానికి మాత్రం అవి పనికిరావడం లేదు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైన సంగతి ప్రజలకు అర్ధం అవుతోంది. మీకు చిత్తశుద్ది ఉంటే, శాంతి భద్రతలు కాపాడాలని నిశ్చయించుకుంటే ప్రతీకార ధోరణితో పాలన చేయకండి. తక్షణం సీతానగరంలో, బస్టాండ్ ఎదురుగా ఉండే బ్రిడ్జీ సమీపంలో ఉండే బ్లేడు బ్యాచ్ ని గంజాయి బ్యాచ్ ని ఏరిపారేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరించడం పట్ల సర్వత్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు బ్లేడ్ బ్యాచ్, గంజాయి ముఠాల మీద ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉందా? రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? వారిని ఏరిపారేయకపోతే శాంతి భద్రతల సమస్యగా మారతారు. మహిళలకు రక్షణ ఉండదు. కాబట్టి తక్షణం పోలీస్ శాఖ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీద ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నాం.
విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఈ బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్ విజృంభిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ ప్రజల మీద దాడులు, దోపిడిలు చేస్తూ ఉన్నారు. విజయవాడ సీపీ గారు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి వీరందర్నీ నగరం నుంచి ఏరిపారేసి కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పశ్చిమ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్ ల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. నైజాం గేట్ సమీపంలో జరిగిన మర్డర్ ని పశ్చిమ నియోజకవర్గం ప్రజలు మర్చిపోలేదు. ఇక్కడ కూడా శాంతి భద్రతలు పునరుద్దరించాలని కోరుతున్నాం” అన్నారు.