జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ లేఖ రాసిన రఘురామ కృష్ణం రాజు

జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ లేఖ రాసిన రఘురామ కృష్ణం రాజు
Spread the love

శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్
విషయం: కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల నిర్వహణ
సూచిక: నవ ప్రభుత్వ కర్తవ్యాలు లేఖ 4
ముఖ్యమంత్రి గారూ,
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులతో చర్చించిన తర్వాత 12వ తరగతి సీబీఎస్ఇ బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ జూన్ 1వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ 19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాని బారి నుంచి పిల్లలను కాపాడేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సీబీఎస్ఇ బోర్డుకు సంబంధించిన నిర్ణయం తీసుకోగానే అన్ని రాష్ట్రాలూ 2021 సంవత్సరానికి గాను వారి వారి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.


అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించాలనే విధంగా స్థిర నిర్ణయం తీసుకుని ఉన్నది. ఈ పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు హాజరు కావాల్సి ఉంది.

దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో జూన్ 22న కేసు విచారణకు వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను నిర్వహించేందుకే నిర్ణయం తీసుకోబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు స్పష్టం చేయగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని జూన్ 24 లోపు తమకు వెల్లడించాలని ఆదేశించింది. జులై 1వ తేదీ తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్పగా జూన్ 24 లోపే చెప్పాలని సుప్రీంకోర్టు గట్టిగా ఆదేశించింది.
రాష్ట్రంలోని విద్యార్ధులను మానసిక వత్తిడికి గురి చేయకుండా తక్షణ నిర్ణయం తీసుకుని నేడే ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు, తద్వారా విద్యార్ధులకు తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను.
సీబీఎస్ఇ, ఐసిఎస్ఇ లతో బాటు 20 రాష్ట్రాల విద్యాబోర్డులు కోవిడ్ 19 మహమ్మారి కారణంగా తమ తమ రాష్ట్రాలలో విద్యార్ధులకు పరీక్షలను రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష రాసేందుకు భౌతికంగా హాజరు కాబోతున్న 5 లక్షల మంది విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నుంచి రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నదనేది మిలియన్ డాలర్ ప్రశ్నిగానే మిగిలిపోయింది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు చూస్తూ ఆందోళన చెందుతున్న వారందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కరోనా సమయంలో 5 లక్షల మంది విద్యార్ధులకు సురక్షితంగా పరీక్షలు ఎలా నిర్వహిస్తుందో తెలుసుకోవాలని ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.


ఏ ఒక్క విద్యార్ధి కరోనా బారిన పడినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్ధులు కరోనా బారిన పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటారో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అంత విశ్వాసంతో ఎలా ఉన్నారో చెబితే అందరూ కూడా సంతోషించేందుకు వీలుకలుగుతుంది.
దేశంలోని ఆరు రాష్ట్రాలు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలు నిర్వహించగా మరో 18 రాష్ట్రాలు పరీక్షలను నిర్వహించేది లేదని తేల్చి చెప్పగా నేటి వరకూ ఏ విషయం చెప్పకుండా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనే విషయం కూడా మీకు తెలియచేస్తున్నాను.
పరీక్షల నిర్వహణకు సంబంధించి తమ వైఖరి స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు జూన్ 17న సంబంధిత రాష్ట్రాల విద్యా శాఖ మంతులను అడిగింది. దానికి మన విద్యా శాఖ మంత్రి సురేష్ సమాధానమిస్తూ రాష్ట్రంలోని విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు నిర్వహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేసి ఎంతో మంది విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను మానసిక వత్తిడికి గురిచేశారు. పరీక్షలు రద్దు చేయడం అనేది చివరి అస్త్రంగానే చూస్తామని కూడా మంత్రి చెప్పడం మరింత వత్తిడి పెంచింది. పరీక్షలను రద్దు చేసే నిర్ణయం తీసుకోవడం ఎంతో తేలికైనదని, అయితే విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పడం తో విద్యార్ధులతో బాటు వారి తల్లిదండ్రులు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. జూన్ 17న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఖాతరు చేయకుండా పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైపోయింది. కోవిడ్ ప్రోటోకాల్స్ ను కచ్చితంగా పాటిస్తూ పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పడం ఉపాధ్యాయులను మానసిక వత్తిడికి గురి చేసింది.


2021 సంవత్సరానికి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు మే 6 నుంచి 23వ తేదీ వరకూ టైమ్ టేబుల్ జారీ చేశారు. ఏప్రిల్ 29న అడ్మిట్ కార్డులను కూడా ఇంటర్ బోర్డు జారీ చేసింది. తీరా చూస్తే హైకోర్టు ఆదేశాలతో పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతూ విద్యాశాఖను ఉరుకులుపరుగులు పెట్టించిన మంత్రి చివరకు సాధించింది శూన్యం. కేవలం విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు మానసిక క్షోభ మిగిల్చడం తప్ప ఏమీ చేయలేదు.
అంతే కాకుండా ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ మన విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కు లేఖ కూడా రాశారు. తాము ఎంతో పకడ్బదిగా 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. పరీక్షలు పూర్తిచేసిన 40 రోజుల్లో ఫలితాలు కూడా ప్రకటిస్తామని కూడా విద్యాశాఖ మంత్రి ఎంతో ఆర్భాటంగా కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పరీక్షలకు 15 రోజుల ముందే షెడ్యూల్ ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పడం ఇక్కడ గమనార్హం.
కోవిడ్ 19 మహమ్మారి కారణంతో భారీగా నష్టపోయిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో కోవిడ్ 19 పాజిటీవ్ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూనే ఉన్నది. అయినా సరే విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించే అంశంలో ఇంత మొండిపట్టుదల వహించడం ఎంతో రిస్క్ అనే విషయం మీకు అర్ధం కావడం లేదా?
దయచేసి మీరు ఒక్క విషయం అర్ధం చేసుకోవాలి. పిల్లలు ఏ రకం వైరస్ ల కైనా ఇట్టే గురవుతారు. వారి తల్లిదండ్రుల నుంచి లేదా పరీక్షల సమయంలో పది మందిలోకి రావడం ద్వారా మరింత ప్రమాదకర పరిస్థితులకు దగ్గరవుతారు. ఇది విపరీత పరిణామాలకు దారితీస్తుంది. అందుకోసం మీరు దయచేసి పరీక్షలన్నింటిని తక్షణమే రద్దు చేయండి. ప్రస్తుతం రోజుకు 5 వేల ఇన్ఫెక్షన్లు సోకుతున్న స్థితిలో మనం వైద్య సౌకర్యాలు కల్పించలేని దుస్థితిలో ఉన్నాం. ఇప్పుడు పరీక్షల రద్దు ప్రకటన చేయడం ద్వారా ఎంతో మందికి ఉపశమనం కలిగించినవారం అవుతాం. ప్రస్తుత ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అలాంటి వారికి పరీక్షల రద్దు ప్రకటన అంతులేని ఊరట కలిగిస్తుంది.


ఇలా చేయకపోతే విద్యార్ధులు, తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక భావనలు పెంచుకోవడం ఖాయం. ప్రభుత్వం తమను తీవ్ర ప్రమాదకర పరిస్థితులలోకి నెట్టివేస్తున్నదనే భావనతో తిరుగుబాటు చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. దీని ప్రభావం రాబోయే ఎన్నికలలో స్పష్టంగా కనిపించే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మహమ్మారి సమయంలో తీసుకుంటున్న పరీక్షలు నిర్వహించాలనే ప్రమాదకర నిర్ణయం వల్ల భవిష్యత్తులో మనకు వారు ఓటు వేయరు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు అందరూ మీకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇలా విద్యార్ధులు వారి తల్లిదండ్రులు తిరుగుబాటు చేస్తే మీరు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయి మీ ఆశలు నెరవేరకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే తక్షణమే పరీక్షలను రద్దు చేయండి. నా మాట విని విద్యార్ధుల తల్లిదండ్రులతో వైరం పెట్టుకోకుండా ఉండండి.


భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *