బుచ్చమ్మ ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య: హరీష్ రావు
హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలతో మరొక ఆత్మహత్య చోటుచేసుకుంది. నల్లచెరువు బఫర్ జోన్‌లో నివసిస్తున్న బుచ్చమ్మ గారు, అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. “ఇది ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య,” అంటూ ఘాటు విమర్శలు చేశారు.
హైడ్రా పేరిట పేదల ఇళ్ల కూల్చివేతలు
హైడ్రా పేరుతో ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయని హరీష్ రావు గుర్తుచేశారు. ప్రజలు తమ ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియక ఆందోళనలో ఉన్నారని, దీనికి కారణం ప్రభుత్వ దుష్ప్రభావం మాత్రమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పేదలపై అన్యాయం
“30 ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజల ఇళ్లు కూల్చివేయడానికి రేవంత్ రెడ్డికి ఎవరు హక్కు ఇచ్చారు?” అని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం, పేదలను నిర్వాసితులను చేస్తే వారికి నష్టపరిహారం అందించాల్సి ఉందని, కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు దుయ్యబట్టారు.
ప్రజలకు కన్నీళ్లు పెడుతున్న ప్రభుత్వం
“నష్టపరిహారం ఇవ్వకుండా, ఉపాధి కల్పించకుండా పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయం,” అన్నారు. “ప్రభుత్వం పేదలకు సహాయం చేయాల్సినప్పుడు, వాళ్లకు కన్నీళ్లు పెట్టే విధంగా వ్యవహరిస్తోంది,” అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అఖిలపక్ష సమావేశం డిమాండ్
రాష్ట్రంలో జరుగుతున్న ఈ కూల్చివేతలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. “ప్రభుత్వం ప్రతీ పార్టీని కలుపుకుని ముందుకు వెళ్లాలని, పేదలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి” అన్నారు.
మూసీ సుందరీకరణ వెనుక ఎవరికి లాభం?
“ఈ మూసీ సుందరీకరణ ఎవరికి మేలు చేయాలని చేస్తున్నారు? పేదవారి ఇళ్లు కూల్చి, వాళ్ల జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు,” అని హరీష్ రావు ప్రశ్నించారు.
పేదల ఇళ్లపై దాడులు, రేవంత్ సోదరులపై మన్నింపు?
పేదవారి ఇళ్లు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం అన్యాయం అని, రేవంత్ రెడ్డి సోదరులైతే ముందే అనుమతులు తీసుకునే అవకాశం కల్పించడమేంటని ఆయన తీవ్రంగా విమర్శించారు. “పేదలకు ఒక న్యాయం, రేవంత్ రెడ్డి సోదరులకు ఒక న్యాయం ఏంటని” ప్రశ్నిస్తూ, ఇలాంటి చర్యలను వెంటనే ఆపాలని కోరారు.