ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్‌కు ఊరట | Relief for KTR in this formula race case
తెలంగాణ హైకోర్టు, ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట కలిగించింది. డిసెంబర్ 30 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేసింది.
కేటీఆర్‌పై ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వ తరపున ఏజీ వాదనలు వినిపించగా, కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.
కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం వాదిస్తూ, ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తు లేదని చెప్పారు. 14 నెలల తర్వాత కేసు పెట్టడం రాజకీయ ప్రేరేపితమైనది అని అన్నారు. పీసీ యాక్ట్ ప్రకారం, డబ్బులు ఎవరికి వెళ్తాయో వాళ్లనే నిందితులుగా చేర్చాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ రేసింగ్ సంస్థకు డబ్బులు అందాయని గుర్తు చేశారు. అసలు ఇది అవినీతి కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ప్రభుత్వ తరపు ఏజీ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం అవసరమని చెప్పారు. పూర్తి స్థాయి విచారణ జరిగితే ఎవరెవరికి ఎలాంటి లబ్ధి చేకూరిందనేది తేలుతుందని అన్నారు.
ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం, కేటీఆర్‌ను డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. కేసు విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ తన విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.