Medaram Jatharaకు హైటెక్ భద్రత: పిల్లలు, వృద్ధులకు జియోట్యాగింగ్.. నిఘాకు ఏఐ డ్రోన్లు
దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఈసారి సరికొత్త సాంకేతిక హంగులతో జరగనుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించనున్న ఈ మహా జాతరను సురక్షితంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక కృత్రిమ మేధ (AI) సాంకేతికతను వినియోగిస్తోంది.
జాతర భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
‘మేడారం 2.0’తో హైటెక్ నిఘా
‘మేడారం 2.0’ ప్రణాళికలో భాగంగా ‘టీజీ–క్వెస్ట్’ పేరుతో అత్యాధునిక ఏఐ డ్రోన్లను రంగంలోకి దించారు. దాదాపు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతం, జంపన్నవాగు పరిసరాలు, రద్దీ రహదారులపై ఇవి నిరంతరం పర్యవేక్షణ చేపడతాయి.
అదేవిధంగా హీలియం బెలూన్లకు అమర్చిన పాన్–టిల్ట్–జూమ్ కెమెరాలు ఆకాశం నుంచి రద్దీ పరిస్థితులను విశ్లేషిస్తాయి. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తే ముందుగానే అధికారులను అప్రమత్తం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ మొత్తం భద్రతా ఏర్పాట్లను దాదాపు 13 వేల మంది పోలీసు సిబ్బంది పర్యవేక్షించనున్నారు.
జియోట్యాగింగ్‌తో తప్పిపోయిన వారికి చెక్
గత జాతరల్లో వేల సంఖ్యలో భక్తులు తప్పిపోయిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి ‘జియోట్యాగ్ ఆధారిత మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ సిస్టమ్’ను ప్రవేశపెట్టారు. వొడాఫోన్–ఐడియా సహకారంతో పస్రా, తాడ్వాయి మార్గాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, పిల్లలు మరియు వృద్ధుల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ ఉన్న జియోట్యాగ్‌లను కడతారు.
ఎవరైనా తప్పిపోయినట్లయితే, ఆ ట్యాగ్‌ను స్కాన్ చేస్తే వెంటనే వారి వివరాలు లభించేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది. శబరిమలలో విజయవంతంగా అమలైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారం జాతరలోనూ వినియోగిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ నమోదు సౌకర్యం కల్పించారు.
నేరాల నియంత్రణకు ఫేస్ రికగ్నిషన్
జాతర ప్రాంగణంలో శాంతిభద్రతలు కాపాడేందుకు 12 ప్రత్యేక క్రైమ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు, పార్కింగ్ ప్రాంతాలు వంటి కీలక ప్రదేశాల్లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా పాత నేరస్తులను గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే అలర్ట్ వచ్చే రియల్ టైమ్ సిస్టమ్‌ను కూడా అమలు చేస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం సుమారు 2,000 ఎకరాల్లో 37 పార్కింగ్ ప్రదేశాలు, 50కు పైగా అనౌన్స్‌మెంట్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
గద్దెల పునఃప్రారంభం
ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి గద్దెల ప్రాంగణాన్ని పునఃప్రారంభించి, పైలాన్‌ను ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను దర్శించుకున్న ఆయన, తన మనవడితో కలిసి నిలువెత్తు బెల్లం సమర్పించారు. జాతరను భక్తులు ప్రశాంతంగా, సౌకర్యంగా నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.