కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. అర్హులందరికీ అవకాశం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. అర్హత ఉన్న ఒక్క కుటుంబం కూడా ప్రభుత్వ పథకాల నుంచి దూరం కాకూడదనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. రేషన్ కార్డు లేకుండా మిగిలిపోయిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు రేషన్ కార్డు పొందని కుటుంబాలు ఎవరైనా ఉంటే, వారు కొత్తగా అప్లై చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలు సమర్పించే దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిజంగా అర్హులైన వారికి తప్పకుండా రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రేషన్ కార్డు కేవలం బియ్యం వంటి సరుకులు పొందడానికే కాకుండా, అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
గతంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయిన కారణంగా చాలా మంది పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అనేక మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, ఇంకా ఎవరికైనా మిగిలి ఉంటే వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏదులాపురంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయగా, మద్దులపల్లిలో మార్కెట్ యార్డును ప్రారంభించారు.
పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని ఈ సందర్భంగా సీఎం మరోసారి స్పష్టం చేశారు.