సంక్రాంతి 2026 బాక్సాఫీస్ బరిలో ఎవరు గెలిచారు..? ఎవరు వెనుకబడ్డారు..? పూర్తి విశ్లేషణ

Share this news

సంక్రాంతి 2026 బాక్సాఫీస్ బరిలో ఎవరు గెలిచారు..? ఎవరు వెనుకబడ్డారు..? పూర్తి విశ్లేషణ

తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి సీజన్ ఎప్పుడూ పెద్ద పండుగే. ప్రతి ఏడాది ఈ పండుగను లక్ష్యంగా పెట్టుకుని భారీ సినిమాలు థియేటర్లకు వస్తుంటాయి. అయితే స్టార్ సినిమాలతో పాటు కంటెంట్ బలంగా ఉన్న మధ్యస్థ బడ్జెట్ చిత్రాలు కూడా ఈ సీజన్‌లో అనూహ్యంగా మెప్పిస్తుంటాయి. 2026 సంక్రాంతి కూడా అలాగే ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ ఫలితాలను ఇచ్చింది.

‘మన శంకర వర ప్రసాద్ గారు’ – సీజన్ కింగ్

ఈ సంక్రాంతి బరిలో అసలైన విజేతగా నిలిచింది ‘మన శంకర వర ప్రసాద్ గారు’. చిరంజీవి తనకు అలవాటైన కామెడీ జోనర్‌లోకి తిరిగి రావడం, దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సినిమాపై మొదటినుంచే భారీ అంచనాలు నెలకొల్పాయి. సినిమా విడుదలైన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించి అద్భుతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ప్రచారం నుంచి విడుదల ప్లానింగ్ వరకు అన్నీ పక్కాగా అమలవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం, చిరంజీవి కెరీర్‌లోనే కాక అనిల్ రావిపూడి కెరీర్‌లోనూ టాప్ హిట్స్‌లో ఒకటిగా నిలిచే దిశగా సాగుతోంది.

‘నారి నారి నడుమ మురారి’ – సైలెంట్ హిట్

సంక్రాంతి సినిమాల్లో చివరిగా రిలీజైన ‘నారి నారి నడుమ మురారి’ మొదట పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగింది. జనవరి 14 సాయంత్రం షోలతో మాత్రమే ప్రారంభమైన ఈ సినిమాకు కంటెంట్ బలం కలిసి వచ్చింది. మొదటి షోల నుంచే మంచి టాక్ రావడంతో థియేటర్లలో హౌస్‌ఫుల్స్ మొదలయ్యాయి.

ప్రేక్షకుల్లో రెండో అత్యంత ఇష్టమైన సినిమాగా ఇది నిలవడం విశేషం. నరేష్ కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలవగా, శర్వానంద్‌కు, నిర్మాత అనిల్ సుంకరాకు ఈ విజయం మంచి బూస్ట్‌గా మారింది. సంక్రాంతి రద్దీ లేకుండా విడిగా విడుదలైతే ఇంకా పెద్ద హిట్ అయ్యేదన్న టాక్ కూడా వినిపిస్తోంది.

‘అనగనగా ఒక రాజు’ – ఫెస్టివల్ అడ్వాంటేజ్‌తో సేఫ్ రన్

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న విడుదలైంది. సినిమా మీద రివ్యూలు మిశ్రమంగా వచ్చినప్పటికీ, నవీన్ నటనకు, భీమవరం పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కథ మాత్రం సగటు స్థాయిలోనే నిలిచింది.

అయినా సంక్రాంతి సీజన్ ప్రయోజనంతో సినిమా గౌరవప్రదమైన వసూళ్లను రాబట్టగలిగింది. ఫుట్‌ఫాల్స్ నిలకడగా ఉండటంతో రన్ సేఫ్ జోన్‌లో కొనసాగుతోంది.

‘ది రాజా సాబ్’ – భారీ అంచనాలు.. తక్కువ ఫలితం

2026 సంక్రాంతికి ముందుగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చిన తొలి పెద్ద సినిమా ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కొత్త తరహా హారర్-ఫాంటసీ అవతార్‌లో కనిపించడం ఆసక్తిని రేపింది. కానీ బలహీనమైన కథనం, సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల సినిమా మిశ్రమ టాక్‌తోనే సరిపెట్టుకుంది.

మూడు రోజుల ముందే రిలీజ్ అయినప్పటికీ, ఆ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకోలేకపోయింది. వసూళ్లు ఎక్కువగా ప్రభాస్ స్టార్ ఇమేజ్ మీదే ఆధారపడ్డాయి. అభిమానుల్లో కూడా ఆశించిన స్థాయి సంతృప్తి లేకపోవడంతో ఇది ఈ సీజన్‌లో బలహీన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ – నిరాశపరిచిన ప్రయత్నం

రవితేజ ప్రధాన పాత్రలో, కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఉద్దేశంతో తెరకెక్కింది. కానీ కంటెంట్ బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. థియేటర్లలో ఫుట్‌ఫాల్స్ తక్కువగా ఉండటంతో ఇది సంక్రాంతి రేస్‌లో వెనుకబడిపోయింది.

మొత్తం మీద…

సంక్రాంతి 2026లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’, ‘నారి నారి నడుమ మురారి’, ‘అనగనగా ఒక రాజు’ సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలుగా నిలిచాయి. మిగతా రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేకపోయాయి. ఈసారి కూడా ఒక విషయం స్పష్టమైంది – పండుగ సీజన్ అయినంత మాత్రాన హిట్ గ్యారంటీ కాదు… కంటెంట్ ఉంటేనే అసలైన విజయం.

ఇది కేవలం వ్యక్తిగత రివ్యూ మాత్రమే.!


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *