Good News : మహిళలకు గుడ్ న్యూస్! మహిళల సాధికారతకు ప్రభుత్వం కీలక నిర్ణయం.

Share this news

Good News : మహిళలకు గుడ్ న్యూస్! మహిళల సాధికారతకు ప్రభుత్వం కీలక నిర్ణయం.

Good News : తెలంగాణలో మహిళలను ఆర్థికంగా మరింత బలపర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్వయం సహకార సంఘాల ద్వారా వేలాది మహిళలు ఉపాధి పొందుతున్న నేపథ్యంలో, ఇప్పుడు వారికి మరింత ఆదాయం తెచ్చిపెట్టేలా కొత్త అవకాశాన్ని ప్రభుత్వం అందించబోతోంది. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులను మహిళా స్వయం సహకార సంఘాలకు కేటాయించే ప్రతిపాదనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా అధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు. నగరవ్యాప్తంగా ఉన్న వేలాది మహిళా సంఘాల్లో తొలిదశలో 40 నుంచి 50 సంఘాలను ఎంపిక చేసి, వారికి ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఆయా సంఘాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా ప్రయోగం మంచి ఫలితాలు ఇస్తోందని, అదే మోడల్‌ను హైదరాబాద్‌లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆసక్తి ఉన్న మహిళలను గుర్తించి, అర్హతల ఆధారంగా బస్సులను కేటాయించే ప్రక్రియ ప్రారంభించనున్నారు.

మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం

మహిళల స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోంది. స్త్రీ శక్తి వంటి పథకాల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించడం, వారు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే డ్వాక్రా సంఘాలకు పెట్రోల్ బంకులు, డెయిరీ పార్లర్లు వంటి వ్యాపార అవకాశాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.

ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మహిళా సంఘాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల మేర వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన తెలిపారు. మహిళలను ఆర్థికంగా స్వతంత్రులుగా, భవిష్యత్తులో కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

అదే సమయంలో, రుణాల మంజూరులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు, అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని సూచించినట్లు సమాచారం.

మొత్తానికి, మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడం, వారిని స్వయం ఆధారితంగా తీర్చిదిద్దడం అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించే ఈ నిర్ణయం వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపే అవకాశంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *