School Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్! వరుసగా 4 రోజులు సెలవులు!
School Holidays: సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. త్వరలో పరీక్షలు ఉండటంతో విద్యార్థులు మళ్లీ చదువుల బాట పట్టారు. అయితే ఈ నెలాఖరులో మరోసారి విద్యార్థులకు కొద్ది రోజులు విశ్రాంతి దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర.
తెలంగాణ గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతరను ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తిస్తారు. ఈ ఏడాది జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చి దేవతలను దర్శించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో జాతర సమయంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ కుటుంబాలతో కలిసి జాతరకు వెళ్లే అవకాశం ఉన్నందున సెలవులు ఇవ్వడం సమంజసమని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా మేడారం జాతర సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని విద్యా సంస్థలకు స్థానిక సెలవులు ప్రకటించే సంప్రదాయం ఉంది. అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇస్తారా? లేదా కేవలం జాతర జరిగే ప్రాంతాలకే పరిమితం చేస్తారా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వస్తుంటారు. ఈ కారణంగా రహదారులు, బస్సులు, రైళ్లు భక్తులతో కిక్కిరిసిపోతాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేస్తోంది. రవాణా వ్యవస్థపై భారీ ఒత్తిడి పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునే పనిలో ఉంది.
మొత్తానికి మేడారం జాతర కారణంగా విద్యార్థులకు మరోసారి చిన్నపాటి సెలవుల ఆనందం దక్కుతుందా? లేదా అన్నది రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.