Aasara Pension: తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు భారీ గుడ్‌న్యూస్.. ఇక ప్రతి నెలా నేరుగా అకౌంట్లోకి డబ్బులు!
Aasara Pension: తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కీలక గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్న పింఛన్ నగదును ఇక నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆసరా పథకం ద్వారా ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్లు అందిస్తోంది. వృద్ధులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.2 వేల పింఛన్ అందుతుండగా… దివ్యాంగులకు రూ.3 వేల పింఛన్ అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.
ఇప్పటివరకు పోస్టల్ శాఖ ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. అయితే ఈ విధానంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇక నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. దీని వల్ల పారదర్శకత పెరగడంతో పాటు ఆలస్యాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పెన్షన్లు నిజమైన అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, సామాజిక-ఆర్థిక సర్వే వివరాల ఆధారంగా లబ్ధిదారుల వివరాలను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. అనర్హులు జాబితాలో ఉండకుండా ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త పెన్షన్ల మంజూరుపై కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.
అదే సమావేశంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. పంచాయతీ సిబ్బందితో పాటు ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా సమయానికి జీతాలు చెల్లించాలని తెలిపారు.
ఒక్క రోజు ఆలస్యం అయినా ఉపేక్షించేది లేదని సీఎం అధికారులను హెచ్చరించారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.50 కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు అందేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పంచాయతీల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా ప్రభుత్వం మార్పులు చేయనుంది. పంచాయతీలు తమ ఆదాయాన్ని ట్రెజరీ అకౌంట్లలో కాకుండా బ్యాంకుల్లో జమ చేసేలా చట్ట సవరణలు తీసుకురావాలని సీఎం సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70(3)లో మార్పులు చేయనున్నట్లు సమాచారం.
ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలతో పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు మరింత సులభంగా అందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ కావడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.