రాష్ట్ర ఫైర్‌వర్క్స్ డీలర్స్ అసోసియేషన్‌కు స్వల్ప ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంలో డీలర్స్ అసోషియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసర విచారణకు స్వీకరించిన జస్టిస్ ఖాన్ విల్కర్ ధర్మాసనం.. బాణసంచా విషయంలో హైకోర్టు ఆదేశాలను సవరించింది. ఎన్జీటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో టపాసులపై ఆంక్షలు వర్తింపచేయాలని సూచించింది. గాలినాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తించేలా చూడాలని ఆదేశించింది. గాలినాణ్యత ప్రమాదకరస్థాయిలో ఉన్నచోట టపాసులపై నిషేధం విధించాలన్న ధర్మాసనం.. సాధారణ గాలినాణ్యత ప్రాంతాల్లో 2 గంటలపాటు గ్రీన్ కాకర్స్ కాల్చేందుకు అనుమతిచ్చింది.
సాధారణ కాలుష్య ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రీన్ టపాసులు కాల్చుకోవచ్చు. అధిక కాలుష్య ప్రాంతాల్లో బాణసంచాను పూర్తిగా నిషేధించింది. దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు ఇవే ఆంక్షలు వర్తించనున్నాయి. ఫైర్‌వర్క్స్ డీలర్స్ సంఘం పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం.. తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది.