తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తా: నిమ్మగడ్డ
ప్రభుత్వం పిటిషన్ వేయకపోతే ఆశ్చర్యపడాలని వ్యాఖ్య
అమరావతి: వెయ్యి శాతం పారదర్శకతతో ‘ఈ-వాచ్’ యాప్‌ను రూపొందించినట్లు ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోసం కొత్తగా రూపొందించిన ఈ-వాచ్ యాప్‌ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో బుధవారం ఎస్‌ఈసీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ యాప్‌పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై ఎస్ఈసీ స్పందించారు.
రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయకపోతే ఆశ్చర్యపడాలి తప్ప వేస్తే ఆశ్చర్యం ఏముందని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెల్లడించిన తర్వాత ఇందులో ఎలాంటి వివాదాలకు చోటులేదన్నారు. ఎలాంటి సందేహాలు, ప్రశ్నలకు తావులేకుండా యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. సమావేశాలతో కాలం గడపకుండా పనికే ప్రాధాన్యత ఇస్తానని.. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తానని ఎస్‌ఈసీ తెలిపారు.