- రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీ
- సాయంత్రం 6గంటల వరకు 81.14 శాతం పంపిణీ పూర్తి
- మొత్తం రూ. 1200 కోట్లు పంపిణీ
- ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందచేసిన వలంటీర్లు
వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులకు మంగళవారం ఉదయం నుంచే వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 2.68 లక్షల మంది వలంటీర్లు పెన్షనర్ల ఇంటికి వద్దకు వెళ్ళి, లబ్ధిదారుల చేతికే ఫించన్ సొమ్మును అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మొదటి రెండు గంటల్లోనూ దాదాపు యాబై శాతంకు పైగా ఫించన్ల పంపిణీ పూర్తయ్యింది. సాయంత్రం ఆరు గంటల వరకు 81.14 శాతం మందికి పెన్షన్ల అందచేతను పూర్తి చేశారు. మొత్తం 61.68 లక్షల మంది పెన్షనర్లకు గానూ 50.04 లక్షల మందికి ఫింఛన్ సొమ్ము అందింది. ఆగస్టు నెలకు సంబంధించి, సెప్టెంబర్ ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1496 కోట్లు విడుదల చేయగా, తొలి రోజు సాయంత్రం 6 గంటల వరకు రూ. 1200 కోట్లు పంపిణీ చేశారు. మిగిలిన వారికి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా చిత్తూరుజిల్లాలో 93.91శాతం, విజయనగరంజిల్లాలో 93.11శాతం, వైయస్‌ఆర్ కడప జిల్లాలో 93.11 శాతం, శ్రీకాకుళంలో 91.47 శాతం, నెల్లూరు జిల్లాలో 92.23 శాతం, పశ్చిమ గోదావరిజిల్లాలో 28.92 శాతం, తూర్పుగోదావరిజిల్లాలో 91.05 శాతం, విశాఖజిల్లాలో 90.19 శాతం, కర్నూలు జిల్లాలో 91.73 శాతం, గుంటూరు జిల్లాలో 88.82 శాతం, అనంతపురం జిల్లాలో 88.98, ప్రకాశం జిల్లాలో 86.57 శాతం, కృష్ణాజిల్లాలో 34.36 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. ఎఆర్టీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ పెషంట్లు గా వున్న వారికి నూరుశాతం పెన్షన్ పంపిణీ జరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ పెషంట్లుగా వున్న వారికి 69.66 శాతం, డిఎంఅండ్‌హెచ్‌ఓ పరిధిలోని హెల్త్ పెన్షనర్లకు 78.14 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది.