యువతకు… రైతాంగానికి మేలు చేకూర్చేలా ప్రకృతి వ్యవసాయం
· 250 గజాల్లో 81 మొక్కలతో ఫలసాయం పొందే విధానం
· చారెడు నేల… బతుకు బాట
· రాజకీయాలకు అతీతంగా అవగాహన కార్యక్రమాలు
· శ్రీకారం చుట్టిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు వెల్లడి
వ్యవసాయం అంటే కనీసం అరెకరం ఉండాలి అనుకొంటూ ఉంటాం… అలా కాకుండా కొద్దిపాటి జాగాలో సాగు చేసి ఆదాయం పొందే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నాం అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు తెలిపారు. కరోనా విపత్తు వల్ల నగరాల్లో ఉపాధి కోసం వచ్చిన కార్మికులు, చిరుద్యోగులు స్వస్థలాలకు వెళ్ళిపోయారు… అలాంటివారు సొంత ఊళ్లోనే ఉపాధి పొందేందుకు అవకాశం ఉన్న సాగు విధానం నమూనాలు రూపొందిస్తున్నాం అన్నారు. 50×50 విస్తీర్ణంలో అంటే సుమారుగా 250 గజాల భూమిలో ఆదాయం ఇచ్చే విధంగా చేయడం లక్ష్యంగా ఈ సాగు ప్రక్రియ ఉంటుంది అని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడ్తాం అన్నారు. ప్రముఖ ప్రకృతి రైతు శ్రీ విజయరామ్ గారి సలహాసహకారాలతో తన వ్యవసాయ క్షేత్రంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “మనకు విజ్ఞానాన్ని, చదువు, సంస్కారాన్ని అందించిన గురుదేవుళ్ళను శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా స్మరించుకొంటూ వ్యవసాయ విజ్ఞాన విషయాలను పంచే కార్యక్రమాన్ని చేపట్టాం. రాజకీయాలకు అతీతంగా యువతకు, రైతులకు ప్రకృతి వ్యవసాయాన్ని… అదీ చిన్నపాటి భూమిలో సాగు చేయడం గురించి తెలియచేస్తాం. 250 గజాల్లో 81 మొక్కలు… ఒక క్రమ విధానంలో నాటి సాగు చేయడం ద్వారా ఏ విధంగా ఫల సాయం పొందవచ్చో తెలియచేస్తాం. ప్రకృతి రైతు శ్రీ విజయరామ్ గారితో గత 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వారు శ్రీ సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరిస్తూ ఉంటారు. శ్రీ విజయరామ్ గారి సలహాలు ప్రకారం కొన్ని నమూనాలు తయారు చేస్తున్నాం.
చారెడు నేల – బతుకు బాట అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఉంటుంది. పరిమిత విస్తీర్ణంలో ఎలా సేద్యం చేయాలి అనేదానిపై ఒక ప్రణాళిక మేరకు నిర్దేశిత డైరీతో అవగాహన కల్పిస్తాం. ప్రతి కుటుంబం కలసి పని చేసుకొని ఆదాయం పొందే విధంగా ఈ తరహా వ్యవసాయ విధానం ఉంటుంది. 81 మొక్కల్లో ఏవేవీ ఉండాలి… వాటికి నీటి వసతి ఎలా సమకూర్చాలి, అందుకు అనుసరించాల్సిన పద్ధతులను సమగ్రంగా తెలియచేస్తాం. ప్రయోగాత్మకంగా నా వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఔత్సాహికులకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తాం” అన్నారు. ఈ సందర్భంగా శ్రీ సుభాష్ పాలేకర్ రాసిన ‘పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం’, ‘పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం చేయడం ఎలా”, ‘ఔనా… సేంద్రీయ వ్యవసాయం ఎక్కువ ప్రమాదకరమా’,తోపాటు తాను రాసిన ‘ప్రకృతి వ్యవసాయం’ పుస్తకాలను కొన్ని విత్తన రకాలను శ్రీ విజయరామ్ గారు శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందించారు.