UPI Payments: అకౌంట్‌లో డబ్బులు లేకున్నా పేమెంట్ చేయొచ్చు!

Share this news

UPI Payments: అకౌంట్‌లో డబ్బులు లేకున్నా పేమెంట్ చేయొచ్చు!

డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో యూపీఐ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తూ భారత్‌పే, యెస్ బ్యాంక్ కలిసి “భారత్‌పే ఫ్లెక్స్” అనే సేవను ప్రారంభించాయి. ఈ ఫీచర్ ఇప్పుడు వినియోగదారుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇప్పటి వరకు యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ ఉండటం తప్పనిసరి. కానీ కొత్త క్రెడిట్ లైన్ ఫీచర్‌తో అవసరమైన సమయంలో ముందుగా చెల్లింపు చేసి, తర్వాత డబ్బులు తిరిగి చెల్లించే సౌకర్యం లభిస్తుంది. ఇది దాదాపు క్రెడిట్ కార్డు మాదిరిగానే పనిచేస్తుంది.

45 రోజుల వరకు వడ్డీ లేదు

భారత్‌పే ఫ్లెక్స్ ద్వారా పొందిన క్రెడిట్‌ను వినియోగదారులు 45 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ గడువులోపు మొత్తాన్ని చెల్లిస్తే అదనపు ఛార్జీలు ఉండవు. దీంతో అత్యవసర ఖర్చుల సమయంలో ఇది ఉపయోగకరంగా మారనుంది.

అంతేకాకుండా వినియోగదారులు తమ ఖర్చులను 3 నుంచి 12 నెలల EMIలుగా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో పెద్ద మొత్తాల చెల్లింపులను సులభంగా నిర్వహించుకోవచ్చు.

ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు?

ఈ క్రెడిట్ లైన్‌ను యూపీఐ QR స్కాన్ పేమెంట్లు, ఆన్‌లైన్ షాపింగ్, మొబైల్ రీచార్జ్‌లు, కరెంట్ బిల్లులు, ట్రావెల్ బుకింగ్స్, పెట్రోల్ బంక్ చెల్లింపులు వంటి అనేక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

రోజువారీ ఖర్చుల కోసం కూడా ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జీతం వచ్చేలోపు లేదా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు ఇది మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

భారత్‌పే యాప్‌లోకి వెళ్లి ముందుగా క్రెడిట్ లైన్ కోసం దరఖాస్తు చేయాలి. అర్హత ఉన్న కస్టమర్లకు కేవలం మూడు నిమిషాల్లోనే ఈ సేవ యాక్టివేట్ అవుతుంది.

అనంతరం KYC పూర్తి చేసి, క్రెడిట్ లైన్‌ను యూపీఐకి లింక్ చేయాలి. తర్వాత యూపీఐ పిన్ సెట్ చేసుకుని సాధారణ యూపీఐ చెల్లింపుల మాదిరిగానే ఉపయోగించుకోవచ్చు.

రివార్డ్స్ కూడా

భారత్‌పే ఫ్లెక్స్ వినియోగదారులకు రివార్డ్స్ కూడా అందిస్తోంది. అర్హత కలిగిన యూపీఐ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్‌లు, ప్రత్యేక ఆఫర్లు పొందే అవకాశం ఉంటుంది.

డిజిటల్ పేమెంట్లలో మరింత సౌలభ్యం కల్పించే ఈ కొత్త ఫీచర్ యూపీఐ వినియోగదారులకు పెద్ద ఊరటగా మారనుంది.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *