మహిళా స్వయం సాధికారత దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రఖ్యాత కంపెనీలతో ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటోది. ఈ క్రమంలోనే హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. సీఎం జగన్ సమక్షంలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఈ నెల 12న వైఎస్‌ఆర్ చేయూత పథకం ప్రారంభిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ పథకం కింద 45–60 ఏళ్లలోపు మహిళలకు చేయూతను అందిస్తామన్నారు. మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేలు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎంపిక చేసిన మహిళలకు ఏటా రూ.18,750 ఇస్తామన్నారు. ఈ సహాయం వారి జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలని, స్థిరమైన ఆదాయాలను కల్పించే దిశగా వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలని అన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే అమూల్తోనూ అవగాహన ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.
ప్రభుత్వం చేయూత నిస్తుందని… బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇస్తుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కంపెనీలు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నామని కోరారు. ఆగస్టు 12న సుమారు రూ.4500 కోట్లు ఈ పథకం కింద ఇస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబరులో వైఎస్సార్ ఆసరా అమలు చేస్తున్నామన్న సీఎం.. 90 లక్షల స్వయం సహాయ సంఘాల వారికి ఆసరా అమలు చేస్తున్నామని వివరించారు. చాలావరకు చేయూత అందుకున్న మహిళలకూ ఆసరా కూడా వర్తిస్తుందన్నారు.దాదాపు కోటి మందికిపైగా మహిళలకు ఆసరా, చేయూత అందిస్తామని.. 9 లక్షల మంది మహిళలకు దాదాపు రూ.6700 కోట్లు ఆసరా కింద ఏటా ఇస్తున్నామని తెలిపారు. ఇలా ప్రతి ఏటా రూ.11వేల కోట్ల చొప్పున, నాలుగేళ్లపాటు రూ.44వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఈ కోటి మంది మహిళల చేతికి ఇస్తున్నామని అని వివరించారు. ఈ సహాయం.. వారికి స్థిరమైన ఆదాయాలు ఇచ్చేదిగా, స్థిరమైన ఉపాధి కల్పించేదిగా ఉండాలని ఆకాంక్షించారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మహిళల జీవితాలను మారుస్తుందని తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాల్లోని మహిళల జీవితాల్లో వెలుగును నింపుతుందన్నారు.