సెప్టెంబరు 10వ తేదీ నుండి గీతా పారాయణం

సెప్టెంబరు 10వ తేదీ నుండి గీతా పారాయణం
Spread the love

సెప్టెంబరు 10వ తేదీ నుండి గీతా పారాయణం : టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

    మానవాళికి భగవద్గీత సందేశాన్ని అందించాలన్న ఉన్నతాశయంతో సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేస్తామని టీటీడీ అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు గీతా పారాయణం శ్లోకపఠనం, వ్యాఖ్యానంతో ట్రయల్ రన్ నిర్వహించారు.

    ఈ సందర్భంగా అదనపు ఇఓ మాట్లాడుతూ సుందరకాండ పారాయణం, విరాటపర్వం పారాయణం భక్తులను మంత్రముగ్ధులను చేశాయని, ఇదే తరహాలో గీతా పారాయణం విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఎస్వీబీసీలో ఈ పారాయణం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు. ప్రముఖ పండితులు శ్రీ కాశీపతి శ్లోక పారాయణం, శ్రీ కుప్పా విశ్వనాధ శాస్త్రి ప్రవచనం చెబుతారని వివరించారు. శ్లోక పఠనం, వ్యాఖ్యానంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని సూచిస్తూ గీతా పారాయణం చేస్తే సామాన్య భక్తులకు చేరువ అవుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం పండితుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. సెప్టెంబరు 3, 5వ తేదీల్లో రెండు విడతల్లో ట్రయల్ రన్ నిర్వహించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారాయణం జరిగేందుకు చర్యలు చేపడతామన్నారు.

   తిరుపతిలోని ఎస్ వి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ మాట్లాడుతూ గీతా పారాయణం తప్పక భక్తుల ఆదరణ చూరగొంటుందన్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక్కడికి మాత్రమే గీతోపదేశం చేయలేదని, సమస్త మానవాళికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారని వివరించారు.

  గీతా పారాయణం ట్రయల్ రన్ కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, వేద పాఠశాల పండితులు పాల్గొన్నారు.
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *