కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రైతులను దెబ్బ తీసి కార్పోరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కెశవరావును ఆదేశించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని సిఎం వివరించారు. ‘‘ పైకి చెప్పడానికి రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు.
కానీ వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోళు చేయడానికి ఉపయోగపడే విధానం కార్పోరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్ల చేయడానికి ఉపయోగపడే బిల్లు. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా ? ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి’’ అని సిఎం చెప్పారు.
‘‘ ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంఖం అమలులో ఉంది. దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 70-75 లక్షల టన్నులను కొనుగోళు చేసింది.35 శాతం శుంఖం తగ్గియడం ఎవరి ప్రయోజనం ఆశించి చేసింది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉండే సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు. మన దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నాయి. సుంఖం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేస్తుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏమిటి? ” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం తీసుకొచ్చే విధంగా, రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉంది కాబట్టి రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలని సిఎం చెప్పారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు.