కోవిడ్-19 పై యుద్ధంలో మాస్కు ప్రధాన ఆయుధం- ఫ్యాబ్రిక్ (వస్త్రంతో చేసిన) మాస్కులను ఎలా ఉపయోగించాలి:
దేశవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న మార్గాల్లో ప్రధానమైనది మాస్కును ధరించడం. మాస్కులను ధరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు ఇతరులకు కూడా వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రెస్పిరేటరీ మాస్కులు, సర్జికల్ మాస్కులకు ఇంట్లో తయారు చేసుకున్న కాటన్ మాస్కులు ఏమాత్రం తీసిపోవని వైద్యులు చెబుతున్నారు.
ఇంట్లో తయారు చేసుకున్న కాటన్ మాస్కులపై యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్కుల కంటే ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులే (సింగిల్ లేయర్వి అయినా సరే) ఉత్తమమైనవంటున్నారు.
అదే విధంగా అవతలి వ్యక్తి దగ్గినపుడు, లేదా తుమ్మినపుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా ఆపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సాధారణ వస్త్రం (ఉదా: టీషర్టు క్లాత్)తో తయారు చేసిన మాస్కులు మెడికల్ మాస్కులకు ఏమాత్రం తీసిపోవని, గాలి పీల్చుకునే సమయంలో అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు జర్నల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ మెకానిక్స్ లెటర్స్ అధ్యయనంలో తమ పరిశోధనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో తయారు చేసుకున్న కాటన్ మాస్కులను వినియోగించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
ఎలాంటి మాస్కులు ధరించాలి? వాటిని ఎలా శుభ్రపరిచాలి? మాస్కును పారవేయాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఈ వైరస్ బారినుంచి తమను తాము రక్షించుకోవడంతోపాటు ఇతరులకు సోకకుండా మంచి చేసిన వారు అవుతారు.
మాస్క్ ఎందుకు ధరించాలి?
కోవిడ్-19 వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినపుడు గానీ, దగ్గినపుడు గానీ ద్రవరూపంలో ఉండే తుంపర్లు గాలి ద్వారా ఎదుటివారి మీద పడే అవకాశం ఉంటుంది. మరికొందరిలో శ్వాసకోస వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కోవిడ్-19కి కారణమయ్యే SARS-CoV-2 అనే వైరస్ ఏరోసోల్స్ (తుంపర్లు)లో మూడు గంటల వరకు ఉంటాయని గుర్తించారు. అదే మనం మాస్కు ధరిస్తే వైరస్ మన శ్వాసవ్యవస్థలోకి ప్రవేశించే అవకాశాలను తగ్గిస్తుంది. అందుకనే తప్పనిసరిగా మాస్కును ధరించాలి.
మాస్కును ధరించినా ఈ కింది జాగ్రత్తలను తీసుకోవాలి:
- ఎదుటివారికి కనీసం 1-మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి
- చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి
- మాస్కు ముందు భాగాన్ని లేదా ముఖాన్ని తాకడం చేయకూడదు
- మాస్కును పైన మరియు కింద సరైన పద్ధతిలో ధరించండి
- మాస్కును తీసుకునే ముందు చేతులను శుభ్రం చేసుకోండి
- మాస్కు మురికిగా లేక పాడైపోయిందేమో పరిశీలించుకోవాలి
- మాస్కు లోపలి భాగం ముఖాన్ని మరియు ముక్కుని తాకుతూ కప్పి ఉంచుతుందో లేదో పరిశీలిచండి
- మాస్కు ధరించినపుడు ముఖానికి ఇరువైపులా గ్యాప్స్ లేకుండా సరిచూసుకోండి
- మీ మాస్కు ముక్కు, నోరును గడ్డాన్ని కప్పేలా ఉండేలా చూసుకోండి
- మాస్కును తీసివేసేటప్పుడు చేతులను శుభ్రం చేసుకోండి
- చెవుల దగ్గర ఉండే పట్టీలు తీస్తూ మాస్కును బయటకు తీయాలి
- తీసేసిన మాస్కును శుభ్రంగా ఉండే బ్యాగు లేదా కంటైనర్లో ఉంచాలి
- మాస్కును తీసేసిన తర్వాత మరోసాని చేతులను శుభ్రం చేసుకోవాలి
- మాస్కును రోజుకు ఒకసారైనా సబ్బు లేదా డిటర్జెంట్ తో శుభ్రం చేసుకోండి. వీలైనంత వరకు వేడి నీళ్లయితే మంచిది
మాస్కు ధరించినపుడు చేయకూడనివి:
- పాడైపోయిన మాస్కును తిరిగి ఉపయోగించవద్దు
- లూజుగా ఉండే మాస్కును ధరించవద్దు
- ముక్కు కిందికి వచ్చేలా మాస్కును ధరించవద్దు
- మీకు 1మీటరులోపు జనం ఉన్నట్టయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్కు తీయవద్దు
- శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే మాస్కులను ఉపయోగించవద్దు
- మురికిగా ఉండే, తడిగా ఉండే మాస్కులను ధరించకూడదు
- మీరు ఉపయోగించిన మాస్కులను ఇతరులతో పంచుకోవద్దు

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.