కేశవాపురం ప్రాజెక్ట్ కి త్వరలో శంకుస్థాపన- మంత్రి కే తారకరామారావు

Spread the love

కేశవాపురం ప్రాజెక్ట్ కి త్వరలో శంకుస్థాపన- మంత్రి కే తారకరామారావు

రిజర్వాయర్ కి అవసరమైన భూసేకరణ దాదాపుగా పూర్తయింది

రెండవ దశ అటవీశాఖ అనుమతులకు సంబంధించి వేగంగా కార్యక్రమాలు

కేశవాపురం ప్రాజెక్టు పూర్తయితే 2050 వ సంవత్సరం వరకు హైదరాబాద్ కు తాగునీటి కొరత ఉండదు

హైదరాబాద్ కి తాగునీటి కొరత ఉండరాదన్న ముఖ్యమంత్రి ఆలోచన ఆధారంగానే కేశవాపురం రిజర్వాయర్

త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా రిజర్వాయర్ శంకుస్థాపన

హైదరాబాద్ లో మరిన్ని ఎస్ టి పిల నిర్మాణానికి ప్రణాళికలు

ప్రస్తుతం ఉన్న 770 ఎమ్మేల్డి లకు అదనంగా మరో పన్నెండు వందల ఎమ్ ఎల్ డి ల ఎస్ టి పి లు

వీటికి సంబంధించిన ప్రణాళికలు, వివరాలతో కూడిన నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించాలని జలమండలికి ఆదేశం

జలమండలి కార్యక్రమాల పైన ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ తాగునీటి అవసరాలకు భరోసా కల్పించే విధంగా నగరం కోసం ప్రత్యేకంగా ఒక రిజర్వాయర్ నిర్మించే ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కేశవాపురం ప్రాజెక్టు తాలూకు ప్రణాళికలు వేగంగా ముందుకు పోతున్నాయని పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన సుమారు 1490 ఎకరాల భూసేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈరోజు హైదరాబాద్ జలమండలి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు మంత్రికి కేశవాపురం ప్రాజెక్టు పనులకు సంబంధించిన పురోగతిని వివరించారు. కేశవాపురం రిజర్వాయర్ కి సంబంధించి ఇప్పటికే మొదటి దశ అటవీశాఖ అనుమతులు లభించిన నేపథ్యంలో తదుపరి అటవీశాఖ అనుమతులకు సంబంధించి మరింత వేగంగా ముందుకు పోవాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే 2050 వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎలాంటి సమస్య ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా నీటి కొరత లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆదేశాలు ఆలోచనల మేరకే ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.త్వరలోనే కేశవాపురం రిజర్వాయర్ కి ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని, దీనికి అవసరమైన అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధంగా ఉన్నదని, వీటికి సంబంధించిన కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాలని, ఆ దిశగా జలమండలి అధికారులు పనిచేయాలన్నారు.

నగరంలో పెద్దఎత్తున మరిన్ని ఎస్ టి పిల నిర్మాణం

ఇప్పటికే మురికి నీటి శుద్దీకరణ లో దేశంలోని అన్ని నగరాల కన్న అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరంలో మురికి నీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు పలు కార్యక్రమాలకు జలమండలి శ్రీకారం చుట్టింది. ఈరోజు జలమండలి అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ ఇందుకు సంబంధించి పలు సూచనలను జలమండలికి చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 770 ఎం ఎల్ డి ల మురికినీటి శుద్ధీకరణ కొనసాగుతున్నదని, ఇది దేశంలోని అన్ని నగరాల్లో కన్నా అత్యధికమని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎస్ టి పిలకి అదనంగా మరో పన్నెండు వందల ఎం ఎల్ డి ల ఎస్ టి పిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ఎస్ టి పిలను మూసి నది కి అనుసంధానం చేస్తూ మూసి శుద్ధీకరణ కు సంబంధించి తగురీతిన ఈ ప్రణాళికలు ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ మాస్టర్ సివరేజ్ ప్లాన్ ఆధారంగా ఎస్ టి పి ల నిర్మాణానికి అవసరమైన అన్ని వివరాలతో కూడిన ఒక నివేదికను వారం రోజుల లోపల ప్రభుత్వానికి సమర్పించాలని జలమండలి అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *