తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది.ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికిప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి శ్రీ కేటీఆర్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచి, 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసిన గ్రీన్‌కో సంస్థకు మంత్రి కేటీఆర్, సీఎస్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మహమ్మారి కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా నియంత్రణకు ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులకు సైతం చికిత్సలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్, ఔషధాల సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.