ఆరోగ్య శ్రీ పరిధిలోకి 95 శాతం ప్రజలు

ఆరోగ్య శ్రీ పరిధిలోకి 95 శాతం ప్రజలు
Spread the love

ఆరోగ్య శ్రీ పరిధిలోకి 95 శాతం ప్రజలు

• డా. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా మరియు బ్లాక్ ఫంగస్(మ్యుకార్ మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్) చికిత్సలు

• డా.వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు రోజుకు రూ. 225ల చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000

• నాడు-నేడు పథకం కింద దశలవారీగా మూడేళ్లలో ఆసుపత్రుల ఆధునికీకరణ

• 9,712 డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది పోస్టుల నియామకం

• 108/104 సేవల కోసం 1,088 అంబులెన్స్ లు/ సంచార వైద్యశాలలు

• “వైఎస్సార్ కంటి వెలుగు” పథకం క్రింద ఉచిత కంటి వైద్య సేవలు

• వ్యాధి తీవ్రతను బట్టి రూ.2,250 నుండి రూ.10 వేల వరకు పెన్షన్లు

వైద్యం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరూ ఇబ్బందిపడకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది.

డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ: వైద్య సేవల రంగంలో విప్లవాత్మక అడుగులకు శ్రీకారం చుడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో “డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ” పథకం ద్వారా క్యాన్సర్ తో సహా 2,434 వైద్య ప్రక్రియలకు ప్రభుత్వం ఉచితంగా చికిత్సలు అందిస్తోంది. ఆరోగ్య శ్రీ సేవలను మరింత విస్తృతపరిచేందుకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలలోని 130కి పైగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను కూడా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వైద్యం ఖర్చు రూ.1,000 దాటిన అన్ని చికిత్సలకు డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడానికి శ్రీకారం చుట్టింది. ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచడంతో రాష్ట్రంలోని దాదాపు 95 శాతం కుటుంబాలకు డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు గత ప్రభుత్వం పెట్టిన రూ. 680 కోట్ల బకాయిలు చెల్లించడంతో పాటు, జూన్ 2019 నుండి ఇప్పటివరకు చెల్లించాల్సిన మరో రూ.2,398 కోట్ల బిల్లులు ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు రెండు చెవులకూ కాక్లియర్ పరికరం అమర్చి సేవలందిస్తోంది.

డా.వైఎస్సార్ ఆరోగ్య ఆసరా: ఆరోగ్యశ్రీ లో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోగులు కోలుకునే వరకు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డా.వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా రోజుకు రూ. 225ల చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000ల వరకు, డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులూ రోగులకు చెల్లించడం జరుగుతోంది.
ఆసుపత్రులలో నాడు-నేడు: ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు వీలుగా నాడు-నేడు పథకం కింద ఆసుపత్రుల ఆధునికీకరణ పనులు పెద్దఎత్తున చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణం, 1,147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆసుపత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆధునికీకరించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతి ఆసుపత్రిలో అవసరమైనంత మంది సిబ్బంది ఉండేలా 9,712 డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది పోస్టుల నియామకం చేపట్టడం జరిగింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ చొప్పున కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణం, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు, కొత్తగా మూడు క్యాన్సర్, రెండు కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఐటీడీఏల పరిధిలో ఆరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టడం జరిగింది. దశలవారీగా మూడేళ్లలో అన్ని పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో WHO/GMP ప్రమాణాలు కలిగిన మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *