ఆగస్టు నుండి కొత్తవారికీ రేషన్
కొత్తగా మంజూరు అయిన ఆహార భద్రత కార్డుల పంపిణీని ఈ నెల చివరికి పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కొత్తగా ఆహార భద్రత కార్డులు పొందిన వారికి ఆగస్టు నుండి రేషన్ ను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.కొత్తగా మంజూరు ఆయిన ఆహారభద్రత కార్డులను ఆయన బుధవారం రోజున సూర్యపేట నియోజకవర్గంలో మండలాల వారిగా పంపిణీ చేశారు.ఆత్మకూర్ యస్ 425,చివ్వేంల 436,సూర్యపేట పట్టణానికి సంబంధించిన 608 కార్డులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకలి తీర్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో ఉండే ప్రజలలో నాలుక లేని వారు,వారి,వారి బాధలు చెప్పుకోలేక తల్లడిల్లుతున్న వారు ఎక్కడెక్కడ ఉన్నా వారి వారి మనసులను గుర్తించి బాధలను తెలుసుకుని పరిష్కరించే సామర్ధ్యం ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే నన్నారు.
అటువంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ,జీవితాల మీద విశ్వసనీయత పెంపొందించేందుకు అనేక నూతన పధకాలు అమలులోకి తెచ్చిన ఘనత కూడా యావత్ భారతదేశంలో ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత మనందరికంటే బహుబాగా తెలిసిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే నని ఆయన స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర లో మంత్రిగా ఉన్న రోజుల్లో ఇక్కడి ప్రజలను ప్రజలుగా…రైతులను రైతులుగా…
సంస్కృతి ని సంస్కృతి గా చివరి ఆఖరికి ఇక్కడి గ్రామ దేవతలను దేవతలుగా గుర్తించేందుకు వారికి మనస్కరించ లేదన్నారు.అటువంటి దుర్భర పరిస్థితులలో పదవులను తృణప్రాయంగా త్వజించి చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని సాదించిందే ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కోసం అన్నారు.అంతకు ముందు ఏది కావాలన్నా యుద్ధం చేసి సాదించుకోవలసి వచ్చేదని ఆయన గుర్తుచేశారు. సాగు నీళ్లు,త్రాగునీరు, విద్యుత్,ఎరువులు,విత్తనాలు ఒక్కటేమిటి నిత్యావసర సరుకుల వరకు సీమాంద్రల పాలనలో యుద్ధం చేయాల్సి వచ్చేదని ఆయన తెలిపారు. అటువంటి సమయంలోపోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 24 గంటల నిరంతర విద్యుత్, రైతుబందు,2,000,3,000 రూపాయల చొప్పున ఆసరా ఫించన్లు, ఆడపిల్ల పెండ్లి కోసం కళ్యాణాలక్ష్మి/షాదీముభారక్ పథకాలతో పాటు కేసీఆర్ కిట్ వంటి చారిత్రాత్మక పధకాలు రూపొందించి అమలు జరుపుకుంటున్నామన్నారు.
వైశాల్యంలో పెద్దవి…వయస్సు లో పెద్దవిగా పేరుబడిన భారతదేశంలోని మిగితా రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న పధకాలు ఎందుకు ప్రవేశ పెట్టలేదో అన్నది ప్రజలు ఆలోచన చెయ్యాలని ఆయన కోరారు.24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ తెలంగాణా రాష్ట్రంలో సాధ్యం అవుతున్నప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ తో మిగితా రాష్ట్రాలలో ఎందుకు అమలు జరగడం లేదు అన్నది ప్రజల్లో చర్చ జరగాలి అని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.