కొండా సురేఖకు కోర్టు నోటీసులు: నాగార్జున, కేటీఆర్ పరువు నష్టం దావాలు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై గురువారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో సురేఖకు నోటీసులు జారీ చేస్తూ కోర్టు తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.
నాగార్జున తన కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు. రాజకీయ వ్యాఖ్యల్లో భాగంగా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. తన కుటుంబ గౌరవం, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె చేసిన నిరాధార వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగార్జున న్యాయస్థానాన్ని కోరారు.
కేటీఆర్ పరువు నష్టం దావా
మరోవైపు, మంత్రి సురేఖపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఇవాళ కేటీఆర్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాఠోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌లను సాక్షులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇటీవల కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమకు సంబంధించిన పలువురుని ప్రస్తావిస్తూ, కేటీఆర్‌పై వివాదాస్పద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.