సంక్రాంతి : అతిగా బీర్లు తాగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి

Share this news

సంక్రాంతి సంబరాలు విషాదంగా మారాయి: అతిగా బీర్లు తాగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి

అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంక్రాంతి పండుగకు సెలవులపై సొంతూరికి వచ్చిన ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అతిగా మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు.

కంభంవారిపల్లి మండలం కే.వీ.పల్లి పరిధిలోని బండవడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఆవలకుంట మణికుమార్ (34), వేముల పుష్పరాజ్ (26) పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి సరదాగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

అయితే, పార్టీ సమయంలో ఇద్దరూ పోటీ పడుతూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు కలిపి సుమారు 19 బీర్లు తాగినట్లు అధికారులు తెలిపారు. అధిక మోతాదులో మద్యం సేవించడంతో వారి శరీరంలో నీటి లోపం ఏర్పడి, ఇద్దరూ ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకున్నారు.

వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు వారిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, మణికుమార్ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పుష్పరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో ‘నకిలీ మద్యం కారణంగా మరణం’ అంటూ తప్పుడు ప్రచారం జరగడాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. అదే పార్టీలో పాల్గొన్న ఆవలకుంట శ్రవణ్ కుమార్ (23), పసుపులేటి శివమణి (21), ఆవలకుంట వేణుగోపాల్ (20), కోటకొండ అభిషేక్ (18) తక్కువగా మద్యం సేవించడంతో వారు క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.

మృతుల మరణానికి గల అసలు కారణాలపై పూర్తి స్పష్టత కోసం వారు తాగిన బీరు నమూనాలను చిత్తూరుకు పరీక్షల కోసం పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *