గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. LPG కనెక్షన్లపై కేంద్రం కొత్త రూల్స్.. ఇక మార్పులు సులభం!
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. LPG, PNG కనెక్షన్ల మధ్య ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇకపై వినియోగదారులు సులభంగా LPG నుంచి PNGకి, అవసరమైతే తిరిగి LPGకి మారే అవకాశం కల్పించింది. ఈ మేరకు కొత్త సవరణ ఉత్తర్వులను కేంద్రం నోటిఫై చేసింది.
పెట్రోలియం గ్యాస్ సరఫరా, పంపిణీ నియంత్రణ సవరణ ఉత్తర్వులు – 2026 కింద ఈ మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు తీసుకునే గృహ వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు సులభమైన మార్పిడి వ్యవస్థ అందుబాటులోకి తీసుకురానుంది.
కొత్త రూల్స్ ప్రకారం PNG కనెక్షన్ తీసుకున్న తర్వాత 30 రోజుల్లోపు LPG కనెక్షన్ రద్దు చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా ఒకేసారి రెండు కనెక్షన్లు నిర్వహించాల్సిన అవసరం ఉండదు.
అయితే భవిష్యత్తులో PNG అందుబాటులో లేని ప్రాంతాలకు మారితే వినియోగదారులకు మరో సౌకర్యం కూడా కల్పించారు. LPG కనెక్షన్‌ను మళ్లీ పునరుద్ధరించుకునేందుకు ట్రాన్స్‌ఫర్ వోచర్ ఉపయోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తిరిగి కొత్త కనెక్షన్ కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.
ఈ మార్పులు ముఖ్యంగా తరచూ బదిలీలు అయ్యే ఉద్యోగులకు ఉపయోగపడనున్నాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి మారే ఉద్యోగులు ఇప్పటివరకు LPG, PNG కనెక్షన్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు కొత్త నిబంధనలతో వారికి ఊరట లభించే అవకాశం ఉంది.
అలాగే అద్దె ఇళ్లలో ఉండే కుటుంబాలు, విద్యార్థులు, ప్రవాస కుటుంబాలకు కూడా ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. ఒక ప్రాంతంలో PNG వాడి, మరో ప్రాంతంలో LPG అవసరమైతే సులభంగా మారే వెసులుబాటు ఉండనుంది.
కేంద్రం LPG – PNG మధ్య అవాంతరాలు లేకుండా మార్పు జరిగేలా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా PNG వినియోగాన్ని పెంచేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో PNG విస్తరణపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, చమురు సరఫరా అంశాల కారణంగా LPG సరఫరాపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో PNG వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు PNG కనెక్షన్లపై పలు రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి.
చమురు కంపెనీలు కూడా PNG వినియోగదారులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక ఒకేసారి LPG, PNG రెండు కనెక్షన్లు కొనసాగించవద్దని కేంద్రం ఇప్పటికే సూచించింది. PNG తీసుకున్న వారు అవసరమైతే LPG కనెక్షన్ సరెండర్ చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.