పెళ్లి అయ్యిందా? అయితే మీకో గుడ్‌న్యూస్.. LIC నుంచి భార్యాభర్తల కోసం కొత్త పాలసీలు.. బీమాతో పాటు భారీ సేవింగ్స్!
పెళ్లైన దంపతులకు LIC గుడ్‌న్యూస్ చెప్పింది. కుటుంబ ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని భార్యాభర్తల కోసం రెండు కొత్త జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ప్రకటించింది. “న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం – 888”, “న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం – 889” పేర్లతో ఈ పాలసీలు జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఈ పాలసీల ప్రత్యేకత ఏమిటంటే… భార్యాభర్తలిద్దరికీ ఒకే పాలసీలో బీమా రక్షణ లభిస్తుంది. బీమాతో పాటు సేవింగ్స్, గ్యారెంటీడ్ అడిషన్, మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కుటుంబ బాధ్యతలు ఇద్దరూ కలిసి నిర్వహిస్తున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని LIC ఈ ప్లాన్లను రూపొందించింది.
జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం – 888 ప్లాన్‌లో ఒక్కసారే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, నాన్ మార్కెట్ లింక్డ్ ప్లాన్‌గా రూపొందించారు. ప్రతి రూ.1000 బీమా మొత్తానికి రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ జత చేస్తారు. కనీస బీమా మొత్తం రూ.3 లక్షలుగా నిర్ణయించారు.
ఈ పాలసీని 18 ఏళ్లు పైబడిన వారు తీసుకోవచ్చు. పాలసీ గడువు 10 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒక భాగస్వామికి ఏదైనా ప్రమాదం జరిగితే బీమా మొత్తం మరొకరికి చెల్లిస్తారు. అయినప్పటికీ పాలసీ కొనసాగుతుంది. ఇద్దరికీ ప్రమాదం జరిగితే నామినీకి మొత్తం బీమా ప్రయోజనాలు అందిస్తారు.
ఉదాహరణకు… 35 ఏళ్ల భర్త, 32 ఏళ్ల భార్య కలిసి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే సుమారు రూ.8 లక్షల సింగిల్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ గడువు పూర్తయ్యే సమయానికి సుమారు రూ.24 లక్షలు పొందే అవకాశం ఉంటుందని LIC తెలిపింది.
ఇక న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం – 889 ప్లాన్‌లో విడతల వారీగా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. ఇందులో 5, 10 లేదా 15 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించవచ్చు. అయితే పాలసీ టర్మ్ మాత్రం 10 నుంచి 25 సంవత్సరాల వరకు కొనసాగుతుంది.
ఈ ప్లాన్‌లో మరో ప్రత్యేక ప్రయోజనం కూడా ఉంది. ప్రీమియం చెల్లింపు కాలంలో మొదటి పాలసీదారుడికి ప్రమాదం జరిగితే మిగిలిన ప్రీమియాలు మాఫీ అవుతాయి. అయినప్పటికీ పాలసీ మాత్రం కొనసాగుతుంది. దీంతో కుటుంబానికి అదనపు భద్రత లభిస్తుంది.
రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల పాలసీ తీసుకుని, 10 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే వార్షిక ప్రీమియం సుమారు రూ.1.30 లక్షలు అవుతుంది. పాలసీ గడువు ముగిసే సమయానికి గ్యారెంటీడ్ అడిషన్‌తో కలిపి సుమారు రూ.28 లక్షలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ రెండు పాలసీల్లో కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అలాగే ఇన్‌స్టాల్‌మెంట్ బెనిఫిట్స్, యాక్సిడెంటల్ రైడర్, క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్, టర్మ్ అష్యూరెన్స్ వంటి అదనపు సదుపాయాలను జోడించుకునే అవకాశం కూడా ఉంది.