డిక్లరేషన్ తీసేయాలని నేను చెప్పలేదు : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదుట తనను కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆ వివరాలు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మీద విశ్వాసం, నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా రోజూ వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. ముఖ్యమైన పర్వదినాలలో రోజుకు 80 వేల నుంచి లక్ష మంది కూడా స్వామివారి దర్శనానికి వస్తారు. వీరిలో వివిధ మతాలకు చెందినవారు ఉంటారు. వారందరినీ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అడగలేము కదా? అని మాత్రమే నేను మాట్లాడాను. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేను రాజకీయాల గురించి మాట్లాడటానికి తిరస్కరించాను. ప్రతిపక్ష నేత టిటిడికి సంబంధించిన విషయాల మీదే ఆరోపణలు చేసినందువల్ల మీరు వివరణ ఇవ్వాలని మీడియా సోదరులు మరోసారి అడగడంతో నేను ఈ విషయాల గురించి మాట్లాడాను.
శ్రీమతి సోనియా గాంధీ గారు, దివంగత సిఎం డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డిగారు స్వామివారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వలేదని మాత్రమే నేను చెప్పాను. అందువల్ల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్ రెడ్డిగారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాను. టిటిడి చట్టంలోని రూల్ : 136 ప్రకారం హిందువులు మాత్రమే దర్శనానికి అర్హులు. స్వామివారి దర్శనం చేసుకోదలచిన ఇతర మతస్తులు తాము హిందూయేతరులమని దేవస్థానం అధికారులకు చెప్పి తమంతకు తాము డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రూల్ : 137లో స్పష్టంగా ఉంది. 2014లో ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం ఎవరైనా గుర్తించదగిన ఆధారాలు ఉన్నవారైతే (ఉదాహరణకు ఏసయ్య, అహ్మద్, సర్దార్ సింగ్ ఇలాంటి ఇతరత్రా పేర్లు లేదా వారి శరీరం మీద ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉంటే) దేవస్థానం అధికారులే డిక్లరేషన్ అడుగుతారు. గతంలో అనేకమంది ఇతర మతాలకు చెందిన రాజకీయ, అధికార ప్రముఖులు స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వలేదు.
శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిగారు ప్రతిపక్ష నేతగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకున్నాకే తన సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ముగిశాక తిరుపతి నుంచి కాలినడకన వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లారు. పార్టీ అధికారంలోకి వచ్చాక స్వామివారి దర్శనం చేసుకున్నాకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గారికి శ్రీవేంకటేశ్వరస్వామివారి మీద అపారమైన భక్తివిశ్వాసాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు. అందువల్లే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పాను తప్ప డిక్లరేషన్ తీసేయాలని నేను చెప్పలేదని పునరుద్ఘాటిస్తున్నాను. టిటిడి ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రజలందరి తరఫున గరుడసేవ రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి శ్రీ వేంకటేశ్వరస్వామివారంటే అపారమైన భక్తివిశ్వాసాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని డిక్లరేషన్ అడగాల్సిన అవసరం లేదని చెప్పాను. సర్వదర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తున్నారు, అన్ని వేల మందిలో ఎవరు ఏ మతస్తులో ఎలా గుర్తించగలుగుతామని మాత్రమే చెప్పాను. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి అనవసర వివాదాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.