బెజవాడలో జనసేన నేత శ్రీ పోతిన మహేష్ అరెస్ట్
• దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై శాంతియుత నిరసనకు పిలుపు
• మంత్రి శ్రీ వెల్లంపల్లి ఇంటి వద్ద నిరసనను అడ్డుకున్న పోలీసులు
• శ్రీ మహేష్ సహా 41 మంది జనసేన నాయకులపై కేసులు
దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు, విజయవాడ కనకదుర్గమ్మ వారి ఉత్సవ రథం వెండి సింహాల మాయం నేపధ్యంలో దేవాదయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద శాంతియుత నిరసనకు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ పిలుపు ఇచ్చారు.
శనివారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అంతే సంఖ్యలో పోలీసులు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని శ్రీ పోతిన మహేష్ సహా పార్టీ నేతల్ని గృహ నిర్భంధం చేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. శాంతియుత నిరసన అడ్డుకోవడం అన్యాయం అంటూ జనసేన నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీ పోతిన వెంకట మహేష్, శ్రీ అజయ్ వర్మ ఠాకూర్, శ్రీ ఆకుల కిరణ్ కుమార్, శ్రీ బొలిశెట్టి వంశీ, శ్రీ వెన్నా శివశంకర్, వీరమహిళలు శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి , శ్రీమతి షేక్ షహీనా, శ్రీమతి భవానీ సహా 41 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
వీరందరినీ సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరీపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. సెక్షన్ 143, 188, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బయలుదేరిన జనసేన నేతల అరెస్ట్ పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవాలయాలు, దేవతా విగ్రహాలు, రథాలపై దాడులు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాల్సిన ప్రభుత్వం… ఈ దాడులను నిరసిస్తూ ఉన్న జనసేన నాయకులను నిర్బంధించడం అప్రజాస్వామికం. ఈ దాడులతో పాటు దేవాదాయ శాఖలో అక్రమాల గురించి సమగ్ర విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని జనసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు. విజయవాడ అ దుర్గమ్మ వారి వెండి రథం సింహాలు ఏ విధంగా మాయమయ్యాయో దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.