ఆంధ్రప్రదేశ్ లో మత్స్య విశ్వవిద్యాలయం

ఆంధ్రప్రదేశ్ లో మత్స్య విశ్వవిద్యాలయం
Spread the love

ఆంధ్రప్రదేశ్ లో మత్స్య విశ్వవిద్యాలయం

• ఆక్వాహబ్ గా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లాలో చైనా అకాడమీ సాంకేతిక సహకారంతో ఆనంద్ గ్రూప్‌తో కలిసి పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు వీలుగా ఆర్డినెన్స్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

• రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయంతో యూనివర్సిటీ

• దేశంలో ప్రత్యేకంగా 5 మాత్రమే ఫిషరీస్ విశ్వవిద్యాలయాలు

• ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో ఏపీకి ఫిషరీస్ యూనివర్సిటీ

• మత్స్య రంగంలో సమగ్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నిర్ణయం

• సీఎం నిర్ణయంతో ప్రత్యక్షంగా,పరోక్షంగా లక్షలాది మంది ఆక్వా రంగంపై ఆధారపడిన రైతులకు ప్రయోజనం

• నెరవేరిన జిల్లా వాసుల చిరకాల వాంఛ

• నిపుణుల కొరత వల్ల ప్రతి ఏటా దాదాపు రూ.2,500 కోట్లు నష్టపోతున్న ఆక్వా రైతులు

• యూనివర్సీటి ఏర్పాటు ద్వారా నష్టాన్ని సులువుగా అధిగమించవచ్చన్న భావనలో ప్రభుత్వం

• సాంకేతిక సెమినార్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సామర్థ్యంకు పెంపొందించే కార్యక్రమాలు

• గతంలో భూమి కేటాయించకపోవడంతో మరుగున పడిన యూనివర్సిటీ ఏర్పాటు…ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

: సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి

విజయవాడ, 6 సెప్టెంబర్: మత్స్య రంగంలో సమగ్ర అభివృధ్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీ కోసం ఏర్పాటు కోసం పీపీపీ పద్ధతిన రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్-2020కి సెప్టెంబర్ 3న జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మత్స్య సంపద అధికంగా, ఆక్వా రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న మత్య్స విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ యూనివర్సిటీకి రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని వివరించారు. నిపుణుల కొరత వల్ల ఆక్వా రంగానికి చెందిన రైతులు ప్రతి ఏటా రూ.2500 కోట్లు నష్టపోతున్నారని అంచనా.యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ఈ నష్టాన్ని సులువుగా అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

       దేశంలో ప్రత్యేకంగా కేవలం 5 మాత్రమే ఫిషరీస్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని ఏపీలో యూనివర్సీటీ ఏర్పాటుతో మొత్తం సంఖ్య ఆరుకు చేరుతుందన్నారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్  ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ సంస్థ మహారాష్ట్రలో ఉండగా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లో  మాత్రమే ఫిషరీస్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని తెలిపారు. ఆయా యూనివర్సిటీల్లో ఫిషరీస్ కోర్సులు మాత్రమే ఉన్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో తొలిసారిగా మరింత వినూత్నంగా ఏపీలో ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందన్నారు.

ఓ వైపు పాడి పంటలతో రాష్ట్ర వ్యవసాయ రంగానికి తలమానికంగా నిలిచి దేశ ధాన్యాగారంగా పేరొందడం, మరోవైపు మత్స్యసంపద అధికంగా ఉన్న పశ్చిమగోదావరిలో యూనివర్సీటీ ఏర్పాటు నిర్ణయంతో జిల్లా వాసుల చిరకాల వాంఛ నెరవేరిందని కమిషనర్ అన్నారు. అంతేగాక మత్స్య పరిశ్రమలో జిల్లా బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. వాస్తవానికి పశ్చిమగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆక్వా హబ్ అని అభివర్ణించారు. జిల్లాలో బ్లూ రివల్యూషన్ బాగా అభివృద్ధి చెందిందని, అధిక దిగుబడినిచ్చే మత్య్స జాతులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 2017-18 సంవత్సరానికి 10,51,754 టన్నుల చేపల ఉత్పత్తిని సాధించిందని తెలిపారు. జివిఎ రూ .10,088 కోట్లు నమోదు అయ్యిందన్నారు.అదే విధంగా 2018-19 సంవత్సరానికి, 15 వేల కోట్ల జివిఎతో 11.50 లక్షల మెట్రిక టన్నుల లక్ష్యం కాగా 10 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తిని సాధించారన్నారు. 2019-20 లో 11 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదు అయిoదని గణాంకాలు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు అంశం 2015 లోనే తెరపైకి వచ్చిందని గుర్తుచేశారు. బ్యాంకాక్‌లోని అంతర్జాతీయ ఉన్నత విద్యాసంస్థ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎఐటి), ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్, ఓషన్ యూనివర్శిటీని స్థాపించడంలో సహాయపడటానికి అంగీకరించిందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి ముందుకొచ్చిందని వివరించారు. యూనివర్శిటీని త్వరలో ప్రారంభించాలని ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీ (భీమవరం) ఉద్దరాజు ఆనంద రాజు (యుఎఆర్) ఫౌండేషన్ అడుగులు వేసిందన్నారు. పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌ నర్‌ షిప్ (పిపిపి) కింద ప్రతిపాదించిన కొత్త విశ్వవిద్యాలయాన్ని సుమారు 150 ఎకరాల్లో నిర్మించనున్నట్లు ఆనంద గ్రూప్ చైర్మన్ యు.కె. విశ్వనాధరాజు అప్పట్లో ప్రకటించారు. ఈ మేరకు యుఐఆర్ ఫౌండేషన్ ఏఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఏఐటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ వోర్సాక్‌కానోక్-నుకుల్‌చాయ్, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కజువో యమమ్‌టోటో, ఆక్వాకల్చర్, జల వనరుల నిర్వహణ, విద్యా పరిశోధనలో సహకరించడానికి ఆమోదం తెలిపారని వెల్లడించారు.

 ప్రపంచవ్యాప్తంగా అనుబంధ సంస్థలను కలిగి ఉన్న ఏఐటీ  వ్యవసాయం, ఆక్వాకల్చర్,  జల వనరుల నిర్వహణ, ఇంజనీరింగ్, పరిశోధన,  సామర్థ్యం పెంపుపై పరిశోధనలు చేస్తోందని తెలిపారు.  సాంకేతిక సెమినార్లు నిర్వహించడం ద్వారా ఏపీలో ఆక్వా రైతుల  సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుందన్నారు.  ఆక్వాకల్చర్‌పై  ఏఐటీ  విద్యార్థులకు ఏపీలో ఇంటర్న్‌ షిప్ చేపట్టే అవకాశాలు, ఆక్వా రైతులు, పారిశ్రామికవేత్తలకు ఎక్స్‌ పోజర్ సందర్శనలకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు.              

పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్య విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు అంశం 2017 కొలిక్కి వచ్చిందని, ఈ విషయమై డిసెంబర్ 7 న అప్పటి మత్స్స శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి చైనా ప్రతినిధులతో విజయవాడలో సమావేశమయ్యారని గుర్తుచేశారు. చైనాలోని జియాన్ విశ్వవిద్యాలయం, ఆనంద్ గ్రూప్ సాంకేతిక సహకారంతో ఈ విశ్వవిద్యాలయం స్థాపించాల్సి ఉందన్నారు.జియాన్ విశ్వవిద్యాలయంలో ఐదు లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. అనేక పరిశోధన కార్యక్రమాలు అక్కడ కొనసాగుతున్నాయి. అదే విధంగా ఏపీలో సాంకేతిక సహకారం అందించడానికి ఆ విశ్వవిద్యాలయం అంగీకరించిందని తెలిపారు. మన విద్యార్థులు చైనాలోని విశ్వవిద్యాలయ తరగతి గదుల్లో నేరుగా పాల్గొనడం ద్వారా బోధనా సహాయాన్ని పొందేందుకు చైనా ప్రతినిధులు అంగీకారం తెలిపారన్నారు. సాంకేతిక సహకార కార్యక్రమం కింద, పరిశోధకులు మన విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారని, జ్ఞానాన్ని మార్పిడి చేయడానికి బోధనా సిబ్బంది కూడా ఏపీ కి వస్తారని వారు ఆమోదం తెలిపారు. చైనా విశ్వవిద్యాలయం ఆక్వా ఉత్పత్తులను ఐస్ లేదా ఫ్రీజర్స్ లేకుండా 4 గంటలు రవాణా చేయగలమని అప్పట్లో వారు చెప్పారని గుర్తుచేశారు. అదే విధంగా విశ్వవిద్యాలయం కొరమేను చేపల రకాన్ని అభివృద్ధి చేస్తోందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో యూనివర్సిటీ ఏర్పాటుకు 2015లో గత ముఖ్యమంత్రి పూనుకున్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు.  ఆనంద్ గ్రూప్,  రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వవిద్యాలయంలో 51 శాతం, 49 శాతం వాటా ఉంటుందని వివరించారు. గత ప్రభుత్వం భూమి కేటయుంచకపోవడంతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు అంశం  మరుగున పడిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో యూనివర్సిటీ పూర్తిచేయడానికి ముందుకు వచ్చారన్నారు.

జిల్లా ప్రధాన ఆదాయ వనరు ఆక్వా రంగం..జిల్లాల్లో మొత్తం 20 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి.వీటిపై ఆధారపడి వేలది మంది ఉపాధి పొందుతున్నారు. కాగా జిల్లాలో మత్స్యకారుల జనాభా 56,980 ఉండగా, అందులో 21,867 మంది వృత్తిని ఆధారంగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో వృద్ధి చోదకాలలో ఒకటిగా ఉన్న మత్స్య, ఆక్వా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. అదే విధంగా మంచి, ఉప్పునీటి వనరులతో రాష్ట్రం మత్స్య, ఆక్వా పరిశ్రమల అభివృద్ధికి అపరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఆ స్థానాన్ని పదిపరుచుకుంటుందని తద్వారా అవకాశాలు మరింత మెరుగుపడతాయని సమాచార,పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: