నిరుద్యోగులకు మోదీ సర్కారు త్వరలో శుభవార్త చెప్పనున్నది.
మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి ఉద్యోగాల కల్పనపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నది.
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారతదేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నది.
రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాకేజీని రూపొందించనుంది.
ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, డిమాండ్ పెంచడం లాంటి వాటిపై దృష్టి పెట్టనుంది ప్రభుత్వం.
ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి భారతదేశ జీడీపీ 23.9 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే.
జీ-20 దేశాలన్నింటిలో ఇదే అత్యంత దారుణమైన పతనం.
దీంతో ఖర్చు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఇప్పటికే పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా అనేక వర్గాలకు చేయూతనందించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ రెండు ప్యాకేజీలతో పోలిస్తే ఈసారి ప్రత్యక్షంగా ఆర్థిక వ్యయం జరిగేలా ఉద్దీపన చర్యలు తీసుకోనుంది.
అందులో భాగంగా అర్బన్ జాబ్స్ స్కీమ్ పథకానికి రూ.35,000 కోట్లు ఖర్చు చేయనుందని అంచనా.
మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఏడాదిలోనే పూర్తి చేసేలా 20 నుంచి 25 భారీ ప్రాజెక్టుల్ని చేపట్టనుంది.
దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, రైతులకు పథకాలు, ఉచిత ఆహార పథకం, నగదు బదిలీ లాంటివి జరుగుతాయని మనీకంట్రోల్ కథనం పబ్లిష్ చేసింది.
కొత్తగా ప్రకటించబోయే ఉద్దీపన ప్యాకేజీలో ముఖ్యంగా ఉద్యోగాల కల్పనపైనే దృష్టి పెట్టనుంది కేంద్రం.
ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాగానే ఉంటుంది.
మరో ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించిన డ్రాఫ్ట్ కేబినెట్ నోట్ సిద్ధమవుతోంది.
దసరా, దీపావళి లాంటి పండుగలను దృష్టిలో పెట్టుకొని ఈ వరాలు ప్రకటించనుంది కేంద్ర ప్రభుత్వం.
అదే జరిగితే ఇప్పటికే ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోయినవారికి ఊరట లభిస్తుంది.