నేరుగా ఖాతాల్లోకి రూ.10 వేలు!
మత్స్యకార భరోసా
సముద్రంలో చేపలవేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా అమలుచేసింది. మంగళవారం ఉదయం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మత్స్య, పశు సంవర్డక శాఖా మంత్రి డాక్టర్. సీదిరి అప్పలరాజు తో కలసి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్, జిల్లా కలెక్టర్ జే.నివాస్, ఫిషరీస్ జేడీ టివి.శ్రీనివాసరావు తదతరులు హాజరయ్యారు.
ఈ పథకం కింద సంతృప్త స్థాయిలో (అర్హత గల వారిని ఒక్కరిని కూడా వదలకుండా) శ్రీకాకుళం జిల్లాలోని 11 తీరప్రాంత 4698 మత్స్యకార కుటుంబాలకు రూ.16కోట్ల63లక్షలు అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే 1,19,875 కుటుంబాలకు రూ.10వేల చొప్పున రూ.119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. ఇక గడచిన రెండేళ్లలో మత్స్యకారులకు రూ.211.71 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో రూ.119.87 కోట్లతో కలిపి మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది.
రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన సర్కారు :
గతంలో రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చిన భృతి మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. రెండేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలోనే భృతిని అందజేస్తూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ విధంగా 2019లో 1,02,478 కుటుంబాలకు రూ.102.48 కోట్లు లబ్ధి చేకూర్చగా, 2020లో 1,09,231 కుటుంబాలకు రూ.109.23 కోట్ల మేర సాయమందించారు.