AP బడ్జెట్ పై విమర్శలు చేసిన జనసేన

AP బడ్జెట్ పై విమర్శలు  చేసిన జనసేన
Spread the love

అభూత కల్పనలు… ఆత్మ స్తుతితో ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్

• కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శమని పొగుడుకున్నారు… వాస్తవలేమిటో ప్రభుత్వాసుపత్రులకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది
• ఆరోగ్య శాఖకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచన లేదు
• ప్రత్యేక బడ్జెట్ ఉంటే కరోనా నియంత్రణ… థర్డ్ వేవ్ ను ఎదుర్కొనే సన్నద్ధతపై రోడ్ మ్యాప్ వచ్చేది

రూ.2.29 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంకెల హంగామా తప్ప రాష్ట్ర అభివృద్ధి… ముఖ్యంగా వైద్య రంగం మౌలిక వసతుల కల్పన, ప్రజారోగ్యంపై దృష్టి సారించలేదు. 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అభూత కల్పనలు, ఆత్మస్తుతితో సాగింది. ప్రజలు తమ ప్రాణాలు కాపాడమని రోధిస్తుంటే – శాసన సభలో ముఖ్యమంత్రిని పొగిడేందుకు కొటేషన్లు, పద్యాలు చదువుకొంటూ మభ్యపెట్టారు.
గతేడాది కంటే ఆరోగ్యానికి ఎక్కువ ఇచ్చాం అని చెబుతున్నారు కానీ వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో కరోనా నియంత్రణకు కేటాయించిన మొత్తాలు చూస్తేనే అర్థం అవుతోంది. కేవలం రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించి సరిపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రం ఆరోగ్య విపత్తులో చిక్కుకొని ఉంది. థర్డ్ వేవ్ ముప్పు కూడా ఈ ఏడాదిలోనే ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వ్యవసాయ బడ్జెట్ తరహాలోనే ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా ఈ పాలకులకు లేకపోవడం దురదృష్టకరం. ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి- కరోనా నియంత్రణ, థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధత, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన ఆవశ్యకతను కూడా ఈ పాలకులు గుర్తించలేదు.

• అంత ఆదర్శమైతే ప్రభుత్వ ఆసుపత్రులకు ఎందుకు వెళ్ళడం లేదు?
కరోనా నియంత్రణలో దేశానికే రాష్ట్రాన్ని ఆదర్శంగా చేసుకున్నామని చెప్పి పొగుడుకున్నారు. ఇంతకంటే హాస్యాస్పదమైన ప్రకటన మరొకటి ఉండదు. ముఖ్యమంత్రి గారు ఒకసారి తన ఇంటి నుంచి బయటకు కదిలి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే కరోనా బాధితుల వేదన, ప్రజల భయాందోళనలు అర్థం అవుతాయి. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. అంత ఆదర్శవంతమైన సేవలు ఇస్తుంటే రోగులు ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళడం లేదు? ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సమస్యలు ఏమిటో ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మందుల కొరత తీవ్రంగా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి ఆప్పుల పాలై ఆస్తులు అమ్ముకొంటున్నారు. ఈ వాస్తవాలను ప్రభుత్వం గుర్తించాలి. వీటితో సంబంధం లేకుండా శాసన సభలో ప్రసంగాలు చేసి ప్రభుత్వం తన డొల్లతనాన్ని వెల్లడించుకొంది.

• ఇన్ని వనరులుంటే ఆస్తులు అమ్ముకోవడం ఎందుకు?
రాష్ట్ర రాబడులు, వ్యయాల్లోని అంకెలు చూస్తే ఎన్నో వనరులు మనకు ఉన్నాయి అని అర్థం అవుతోంది. ఏడాది కాలంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులుపడుతూ ఉన్నా ప్రభుత్వ రాబడి తగ్గలేదు. ఇంత కష్ట కాలంలో కూడా ప్రభుత్వ పన్నులు సక్రమంగా చెల్లించిన ప్రజలకు అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంత ఆదాయం ప్రజలు సమకూరుస్తున్నా ప్రభుత్వం ఎందుకు ఆస్తులు ఆమ్ముకోవాలని చూస్తోంది? ఇందుకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి. నెలకు రూ.2 వేల కోట్లు వడ్డీలే చెల్లిస్తున్నారు. ఇక అసలు అప్పు తీర్చాలంటే ఎన్ని తరాలుపడుతుందో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలో ఒక స్పష్టత లేదు అని వెల్లడవుతోంది.
మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో కేటాయింపులు తప్ప వాటిని విడుదల చేసి పనులు చేపడుతున్న దాఖలాలు ఏ కోశానా కనిపించడం లేదు. రహదారుల, రవాణా కోసం రూ.7 వేల కోట్లు ప్రతిపాదించాం అని చెప్పారు. గత బడ్జెట్లోనూ రూ.6,200 కోట్లు నిధులు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడైనా రహదారులను అభివృద్ధి చేశారా? గుంతలు పూడ్చేందుకు తట్టెడు మట్టి అయినా పోశారా? రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో ఇచ్చే నిధులు నీటి మీద రాతల్లా ఈ ప్రభుత్వం మార్చేసింది. సంక్షేమ బడ్జెట్ 32 శాతం పెంచాము అంటూ ఓ అభూత కల్పనతో హడావిడి చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమగ్ర అభివృద్ధి విషయాన్ని పక్కకు నెట్టేసింది. గత బడ్జెట్లో ఇచ్చిన నిధులను కూడా నవ రత్నాలకు మళ్లించేశారు. ఫలితంగా విదేశీ విద్యకు సంబంధించిన నిధులు విడుదల కాక విదేశాల్లో చదువుకుంటున్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ విద్యార్థులు అనేక ఇబ్బందులుపడుతున్నారు.
వాస్తవిక దృష్టితో ప్రజల బాధలు తెలుసుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలి. అలాంటి ఆలోచన ఈ పాలకులకు లేదు. ఈ బడ్జెట్ ఏ మాత్రం ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించలేదు.

(నాదెండ్ల మనోహర్)
చైర్మన్,
రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన


Spread the love

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *