ఓట్లు కావాల్సినప్పుడే కేసీఆర్ హామీలు, పథకాలు
రూ.25వేల పెట్టుబడికి రూ.5వేలు ఇచ్చి ఊరిస్తుండు
- నిత్యావసరాల రేట్లు పెంచి దోపిడీకి పాల్పడుతుండు
- రుణమాఫీ చేస్తానని రైతులకు కుచ్చుటోపీ పెట్టిండు
- వరి వేయొద్దని చెప్పి, కాళేశ్వరం ఎందుకు కట్టినట్టు? కమీషన్ల కోసమా?
- మహిళా సంఘాలను మోసం చేసిన ఘనత కేసీఆర్ దే
- ఓట్లు కావాల్సినప్పుడే కేసీఆర్ హామీలు, పథకాలు
- కేసీఆర్ వడ్లు కొనాల్సిందే.. లేదంటే గుణపాఠం తప్పదు
ప్రజాప్రస్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు 34వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం వరుటూరు గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. మహానేత వైయస్ఆర్ దీవెనలు తీసుకుని యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పారు. వరుటూరు గ్రామం నుంచి వరుటూరు తండా, దుర్గసానిపల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. దుర్గసానిపల్లిలో ప్రజలతో ముచ్చటిస్తుండగా వైయస్ షర్మిల గారితో పాటు పార్టీ కార్యకర్తలపై తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే తేరుకున్న సిబ్బంది తేనెటీగలను నిలువరించారు. తనకంటే ముందుగా ప్రజలను రక్షించాలని షర్మిల గారు సూచించారు. తీనెటీగలు దాడి చేస్తున్నా.. వెనక్కి తిరగకుండా పాదయాత్ర కొనసాగించారు. అనంతరం పాదయాత్ర చండేపల్లి గ్రామానికి చేరింది. ప్రజాప్రస్థానం పాదయాత్ర 400 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా గ్రామంలో వైయస్ఆర్ గారి విగ్రహాన్ని వైయస్ షర్మిల గారు ఆవిష్కరించారు. భోజన విరామం అనంతరం చండేపల్లి నుంచి చామాపూర్, రేగలకుంట, తెర్యాల క్రాస్ మీదుగా సాగింది. ఆ తర్వాత పల్లెపహడ్ గ్రామంలో వైయస్ షర్మిల గారు మాట ముచ్చట నిర్వహించి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
అంతకుముందు సికింద్రాబాద్ లోని బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై వైయస్ షర్మిల గారు విచారం వ్యక్తం చేశారు. కూలీల మృతి ఎంతో కలచివేసిందని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాట ముచ్చట కార్యక్రమంలో వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ..
- రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.5వేలు ఇచ్చి, రైతులకు సంబంధించిన అనేక పథకాలను కేసీఆర్ బంద్ పెట్టిండు.
– ఎకరాకు రూ.25వేల పెట్టుబడి వస్తే.. రూ.5వేలు ఇచ్చి రైతులను ఊరిస్తుండు. - వైయస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎరువుల మీద సబ్సిడీ ఉండేది.
- పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారు.
- రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించారు.
- రాయితీపై విత్తనాలు, ఎరువులు అందజేశారు.
- రైతులు బోరు వేసుకోవడానికి సాయం చేసే వారు,
- ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఖర్చులను నియంత్రించడానికి ఏం చేస్తున్నారు.
- వడ్డీ లేకుండా మహిళలకు రుణాలు ఇస్తామని చెప్పారు, మరి వడ్డీ ఎందుకు వసూలు చేస్తున్నారు.
- వైయస్ఆర్ గారు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతోమంది చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.
- ఈ రోజు మహిళలు రుణాలు తీసుకొని ఇంటి ఖర్చుల కోసమే వాడుకోవాల్సి వస్తుంది. ఇంకా వడ్డీ భారం కూడా మహిళల మీదే పడుతోంది.
- ఇంట్లో ఇద్దరు అర్హులున్నా ఒక్కరికే ఎందుకు పెన్షన్ ఇస్తున్నారు
- కేసీఆర్ ఏం చేసినా ఎన్నికల కోసం, ఓట్ల కోసమే చేస్తాడు
- కేసీఆర్‌కు ప్రజల ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు పథకాలు వస్తాయి, హామీలు వస్తాయి.
- కేసీఆర్ ప్రజల ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు రుణమాఫీ అంటాడు, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానంటాడు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటాడు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానంటాడు, మూడెకరాల భూమి ఇస్తానంటాడు.
- ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ కు రెండుసార్లు అధికారం ఇస్తే ఏం చేశాడు?
- బంగారు తెలంగాణ అని చెప్పి బాధల తెలంగాణగా మార్చాడు, అప్పుల, ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు.
- ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
- ఫీజు రీయంబర్స్ మెంట్ లేక ఎంతో మంది తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కట్టి పిల్లల్ని చదివిస్తే చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకడం లేదు.
- లక్షా తొంభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు లేవు.
- స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టడంలేదు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సృష్టించాలన్న సోయి ఎవరికీ లేదు.
- మరి డిగ్రీలు , పీజీలు చదివిన పిల్లలు ఏం పనులు చేసుకోవాలి?
- ఈరోజు ఉన్నత చదువులు చదువుకున్న పిల్లలు టీ, టిఫిన్ సెంటర్లలో పనులు చేసుకుంటున్నారు, హమాలీ పనులకు పోతున్నారు, గొర్రెలు , బర్రెలు కాస్తున్నారు.
- ఇందుకేనా పిల్లల్ని గొప్పగొప్ప చదువులు చదివించింది.
- రైతులకు లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ 36 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా మోసం చేసారు.
- దళిత బంధు అని చెప్పి ఎన్ని రోజులైంది? ఎంతమందికి దళితబంధు ఇచ్చారు.
- కేసీఆర్ ఓట్ల కోసం ఎన్నిసార్లయినా దొంగ హామీలు ఇస్తారు.
- వైయస్ఆర్ గారు రైతులకు రుణమాఫీ చేశారు.
- రైతుల కోసం ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టారు.
- పావలా వడ్డీకే మహిళలకు రుణాలు అందించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు.
- వైయస్ఆర్ గారు ఉంటే అభయ హస్తం పథకం సక్రమంగా కొనసాగేది.
- ఇప్పుడు ఉన్న పాలకులు కనీసం అభయ హస్తం పథకంలో కట్టిన డబ్బులు కూడా వెనక్కి ఇవ్వలేదు.
- ఆర్థిక పరిస్థితుల కారణంగా పేద విద్యార్థుల చదువులు ఆగిపోకూడదని వైయస్ఆర్ గారు ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం పెట్టారు.
- పేద వాళ్లు కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం చేసుకోవడానికి ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశపెట్టారు.
- ఎంతోమంది పేదలు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లబ్ధి పొందారు.
- వైయస్ఆర్ గారు ఉన్నప్పుడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు 108 వచ్చేది, 104 గ్రామాలలో తిరిగి సేవలు అందించేది.
- పేదల కోసం 46 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇచ్చారు.
- వైయస్ఆర్ గారు పరిపాలించిన అయిదేళ్లలో ఏ చార్జీలు పెంచకుండా అద్భుతంగా పాలించారు.
- ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరైనా బాగుపడ్డారా?
- ఆయన కుటుంబంలో అయిదు ఉద్యోగాలు వచ్చాయి, వాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అయ్యారు.
- కమీషన్ల కోసం కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టి నీళ్లున్నా వరి వేయొద్దంటున్నారు. మరి ఎవరి కోసం కట్టారు ఆ ప్రాజెక్టులు?
- కమీషన్లు తినడానికే ప్రాజెక్టులు కట్టారు.
- వరి వేయొద్దని రైతుకు ఉన్న స్వేచ్ఛను కూడా లాగేసుకుంటున్నారు.
- రైతును, వ్యవసాయాన్ని కూడా బానిస చేసుకుంటున్నారు.
- కేసీఆర్ రైతులకు చివరి గింజ వరకూ కొంటాం వరి వేసుకోండి అని మాటిచ్చారు.
- ఇప్పుడు మోదీ కొనడని నేనూ కొనను అంటున్నారు.
- కేసీఆర్ ప్రజలకు మాటిచ్చిన విధంగా వరి చివరి గింజ వరకూ కొనల్సిందే.
- కేసీఆర్ ఏం చేసినా , ప్రజలకు ఎన్ని సమస్యలున్నా ప్రతిపక్షాలు ఏనాడూ ప్రశ్నించలేదు.
- కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే నేడు కేసీఆర్ కు అమ్ముడుపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా నేడు టీఆర్ఎస్‌లో ఉన్నారు. ఇది రాజకీయ వ్యభిచారం కాదా?
- ప్రజలను మోసం చేసినట్టు కాదా?
- పాలకవర్గం అధ్వాన్నంగా పరిపాలిస్తుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన ప్రతిపక్షం ప్రజల కోసం నిలబడకపోతేనే నేడు మేం వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం.
- ప్రజా సమస్యలపై పోరాటం చేసి , ప్రజలకు వైయస్ఆర్ సంక్షేమ పాలన అందించడమే మా లక్షం.
- నేను వ్యవసాయాన్ని మళ్లీ పండగ చేస్తా, మహిళలు ఆర్థికంగా ఎదిగేలా సాయపడతా, ప్రతి కుటుంబానికి ఒక ఇళ్లు ఇస్తాం, అది కూడా మహిళ పేరు మీదనే కట్టిస్తాం.
- చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం.
- ఒక ఇంట్లో ఎంత మంది అర్హులుంటే అంతమందికి పెన్షన్లు ఇస్తాం.
- ప్రతి వర్గానికి న్యాయం చేయడమే మా లక్ష్యం.