ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
దంపతులు, పరస్పర బదిలీలకే అవకాశం
30 నుంచి జూలై 7 వరకు దరఖాస్తుల స్వీకరణ
అమరావతి,: ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, షెడ్యూల్‌ను పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం విడుదల చేశారు. భార్యాభర్తలు(స్పౌజ్), పరస్పర(మ్యూచువల్) బదిలీలకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏదేని జిల్లాలో ఒక కేడర్‌లో 2021 జూన్ 30 నాటికి రెండేళ్ల సర్వీసు నిండిన ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు అంతర్ జిల్లా బదిలీలకు అర్హులు. బదిలీ కోరుకునే జిల్లాలోని ఎయిడెడ్, లోకల్ బాడీ, రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థలు, యూనివర్సిటీల్లో వారి స్పౌజ్ పనిచేస్తూ ఉండాలి. అయితే స్పౌజ్ విభాగాధిపతి/ సెక్రటేరియట్‌లో పనిచేస్తుంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు బదిలీ చేస్తారు. స్పౌజ్‌కు క్లియర్ వేకెన్సీ ఉంటేనే బదిలీకి అవకాశం ఉంటుంది. మ్యూచువల్ విషయంలో ఒకే కేటగిరీ, ఒకే యాజమాన్యానికి మాత్రమే అనుమతిస్తారు. అనధికారికంగా విధులకు గైర్హాజరులో ఉన్నవారు, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొంటున్నవారు, సస్పెన్షన్‌లో ఉన్నవారు బదిలీకి అనర్హులు. ఒక ఆన్‌లైన్ దరఖాస్తుకు మాత్రమే అనుమతిస్తారు. బదిలీ కోరుకునే ఉపాధ్యాయులు సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.