జ్వరలక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేసుకోండి – మేయర్ విజయ లక్ష్మి
జ్వరలక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేసుకోండి – మేయర్ విజయ లక్ష్మి
ఏమాత్రం స్వల్ప జ్వరం గాని, నలతగానీ ఉంటె వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి గాని, బస్తీ దవాఖానకు గానీ వెళ్లి జ్వర పరీక్షలు చేయించుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో కరోనా కట్టడికై చేపట్టిన చర్యలపై నేడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులు, గ్రేటర్ పరిధిలోని వైద్యాధికారులతో నిర్వహించిన ఈ సమీక్షాసమావేశంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ఇప్పటికే నగరంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటి ఫివర్ సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎవరికైనా స్వల్ప జ్వరం ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అర్బన్ హెల్త్ సెంటర్లలోగానీ, బస్తీ దవాఖానాలో గాని ప్రాథమిక జ్వర పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
జ్వరమున్న వారికి ఉచితంగా కరోనా నివారణ మందుల కిట్ అందచేస్తున్నారని, ఈ మందులను ఐదు రోజులపాటు వాడాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వాక్సినేషన్ కై తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. నగరంలో పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో బల్దియా ఎంటమాలజి, డీఆర్ఎఫ్ విభాగాల ద్వారా హైపోక్లోరైట్ ద్రావకాన్ని స్ప్రేయింగ్ చేయిస్తున్నామని తెలియచేసారు. నగరంలోని బస్తీ దవాఖనాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నందున, బస్తీ దవాఖానాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.