APలో ప్రతి నెల అమలయ్యే సంక్షేమ పధకాల క్యాలెండరు. 2021
ఇద్దరికీ నా విజ్ఞప్తి:
‘ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్న ఎల్లో మీడియా, ప్రతిపక్షం.. ఇద్దరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మాదిరిగా ప్రజల మనోధైర్యాన్ని దెబ్బ తీసే వార్తలు కానీ, అసత్య వార్తలు కానీ, అర్ధసత్యాలు కానీ, అపోహలు కానీ.. ఇలాంటివన్నీ ప్రసారం చేసి, ప్రజల్లో భయాలను సృష్టించి, నిలబడే ప్రాణాలను, ఆడే గుండెలను ఆపేయకండి. అని వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక వారు ఏం చేస్తారన్నది వారి ఆలోచనకే వదిలేస్తున్నాను’.
చిత్తశుద్ధి, నిజాయితీతో పరిపాలన:
‘2019 వరకు రాజకీయ వ్యవస్థ ఏ మాదిరిగా ఉందని గమనిస్తే, ఎన్నికల మేనిఫెస్టో అంటే కేవలం ప్రలోభాలు, అబద్ధాలు చెప్పేదిగా ఉండేది. ఎన్నికల తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే వారు. కానీ నేను ఇవాళ గర్వంగా చెబుతున్నాను. వారి మాదిరిగా నాది పెద్ద వయసు కాకపోవచ్చు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం లేకపోవచ్చు. కానీ, చిత్తశుద్ధితో, నిజాయితీగా పరిపాలన చేస్తున్నానని సగర్వంగా చెబుతున్నాను’.
129 వాగ్దానాల్లో 121 అమలు:
‘మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావిస్తున్నాను. మేనిఫెస్టోకు సంబంధించి రెండేళ్లు కూడా పూర్తి కాక ముందే, సగర్వంగా చెబుతున్నాను.. ఇంతటి కోవిడ్ కష్టాల్లో కూడా 129 వాగ్దానాల్లో 107 వాగ్దానాలు పూర్తిగా అమలు చేశాము. మరో 14 వాగ్దానాల అమలు మొదలై వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 8 వాగ్దానాలు మాత్రమే అమలు చేయాల్సి ఉంది. అంటే రెండేళ్లు కూడా పూర్తి కాక ముందే మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 94.5 శాతం అమలు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను’.
అర్హత ఉంటే చాలు:
‘వారి మాదిరిగా నాకు వయసు లేదు. 40 ఏళ్ల అనుభవం లేదు. ఎల్లో మీడియా మద్దతు లేదు. అయినా గర్వంగా చెబుతున్నాను. ఈ 23 నెలల పాలనలో కులం చూడలేదు. మతం చూడలేదు. రాజకీయం చూడలేదు. వర్గం చూడలేదు. ప్రాంతం చూడలేదు. పార్టీలు చూడలేదు. చివరకు నాకు ఓటు వేయకపోయినా సరే, అర్హత ఉంటే చాలు వారికి కూడా మంచి చేస్తే చాలు అని చెప్పి వారికి కూడా అన్నీ చేశానని ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను. అలా మంచి చేయడమే కాదు, ప్రతి అడుగులో కూడా రాబోయే తరానికి మంచి జరగాలి అని, అభివృద్ధి అంటే ఏమిటన్నది చూపాం’.
ఇదీ ఈ ఏడాది పథకాల క్యాలెండర్:
‘ఇవాళ బడ్జెట్ సందర్భంగా ఈ సంవత్సర పథకాల క్యాలెండర్ చదివి వినిపిస్తాను. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను’.
ఏప్రిల్–2021:
– జగనన్న వసతి దీవెన మొదటి విడత.
– జగనన్న విద్యా దీవెన మొదటి విడత.
– రైతులకు వైయస్సార్ సున్నా వడ్డీ (2019.రబీ).
– పొదుపు సంఘాల మహిళలకు వైయస్సార్ సున్నా వడ్డీ చెల్లింపులు.
మే–2021:
– వైయస్సార్ రైతు భరోసా మొదటి విడత. దాదాపు 50 లక్షల రైతులకు ఇచ్చాం.
– మత్స్యకార భరోసా (వేట నిషేధ సబ్సిడీ). మత్స్యకార భరోసా (డీజిల్ సబ్సిడీ) మొన్ననే దేవుడి దయతో ఇచ్చాం.
– వైయస్సార్ ఉచిత పంటల బీమా (2020. ఖరీఫ్). మే 25న ఇవ్వబోతున్నాం.
జూన్–2021:
– జగనన్న తోడు. తొలి విడత
– వైయస్సార్ వాహనమిత్ర. రెండో విడత
– వైయస్సార్ చేయూత. మూడో విడత చెల్లింపులు.
జూన్ 8న జగనన్న తోడు బ్యాలెన్స్ ఇవ్వబోతున్నాం. ప్రతి మంగళవారం ఒక్కో కార్యక్రమం. జూన్ 8న జగనన్న తోడు, 15న వాహనమిత్ర, 22న చేయూత.
జూలై–2021:
– జగనన్న విద్యా దీవెన రెండో విడత.
– వైయస్సార్ కాపు నేస్తం.
– విద్యా కానుక
ఆగస్టు–2021:
– రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు (2020.ఖరీఫ్).
– ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు.
– వైయస్సార్ నేతన్న నేస్తం.
– అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు.
సెప్టెంబరు–2021:
– వైయస్సార్ ఆసరా.
అక్టోబరు–2021:
– వైయస్సార్ రైతు భరోసా రెండో విడత.
– జగనన్న చేదోడు (రజకులు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులు).
నవంబరు–2021:
– వైయస్సార్ ఈబీసీ నేస్తం. ఇది ఈ ఏడాది అమలు చేసే కొత్త పథకం. ఏటా రూ.15 వేలు చొప్పున సహాయం. అగ్ర వర్ణాల్లోని 45 ఏళ్లు దాటిన అక్కలకు సహాయం.
డిసెంబరు–2021:
– జగనన్న వసతి దీవెన రెండో విడత.
– జగనన్న విద్యా దీవెన మూడో విడత.
– వైయస్సార్ లా నేస్తం.
జనవరి–2022:
– పెన్షన్ నగదు పెంపు. ఈ నెల నుంచి నెలకు రూ.2500.
– వైయస్సార్ రైతు భరోసా మూడో విడత.
– జగనన్న అమ్మ ఒడి.
ఫిబ్రవరి–2022:
– జగనన్న విద్యా దీవెన నాలుగో విడత.
‘ఇది ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్. నెలల వారీగా డేట్లు ఇచ్చి ఒక విశ్వసనీయమైన ప్రభుత్వంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాము’.
రెగ్యులర్ పథకాలు:
‘ఇవి కాకుండా రెగ్యులర్‌గా వైయస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు పగలు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య ఆసరా, వైయస్సార్ పెన్షన్ కానుక ప్రతి నెలా అమలు చేస్తున్నాము’.
రూ.1.25 లక్షల కోట్లు జమ:
‘ఈ రెండేళ్ల పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద మధ్య తరగతి వర్గాల కోసం గట్టిగా నిలబడ్డాం. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ కాదు బ్యాక్‌బోన్ అన్నదానికి కట్టుబడి ఉన్నాం. ఈ 23 నెలల కాలంలో సంక్షేమం, అభివృద్ధి కింద దాదాపు రూ.93,708 కోట్లు వివిధ పథకాల కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. రాజకీయ జోక్యం లేదు’.
‘ఇదే కాకుండా మరో రూ.31,714 కోట్లు పరోక్ష లబ్ధి ద్వారా ఇవ్వడం జరిగింది. మొత్తంగా రూ.1.25 లక్షల కోట్లు ప్రజలకు అందించగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. అనుకోకుండా వచ్చిన ఈ కోవిడ్ కాలంలో ప్రభుత్వం ఇచ్చిన ఆ మొత్తం, ఆ సహాయం ఎంతో అండగా, శ్రీరామరక్షగా నిల్చింది’.