నాగార్జున సాగర్ : దేవరకొండ నుంచి కోదాడ అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలు పూర్తి అవ్వాలి.

నాగార్జున సాగర్ : దేవరకొండ నుంచి కోదాడ అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలు  పూర్తి అవ్వాలి.
Spread the love

నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలన్నారు. ఇటీవల నెల్లికల్లులో శంఖుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి , కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలని సిఎం సూచించారు. ఏలిప్టుకాలిప్టు ప్రకారం అంచనాలను వేరు వేరుగా తయారు చేసి అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని ఇరిగేషన్ శాఖాధికారులను సిఎం కేసిఆర్ ఆదేశించారు.

తెలంగాణ వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిన నేపథ్యంలో వానకాలం సీజన్ ప్రారంభం కాగానే నీటినిఎత్తిపోసి పైనించి చివరి ఆయకట్టు తుంగతుర్తి దాకా వున్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపుకోవాలని సిఎం సూచించారు. ఇప్పటికే కాళేశ్వరం నీటితో 90 శాతం చెరువులు, కుంటలు నిండివుండడంతో భుగర్భ జలాలు పెరిగాయని తద్వారా బోర్లల్లో నీరు పుష్కలంగా లభిస్తున్ననేపథ్యంలో రైతులు వరిపంట విస్తృతంగా పండిస్తున్నారని సిఎం చెప్పారు. రోహిణి కార్తె ప్రారంభమయిన నేపథ్యంలో, నారుమడి సిద్ధంచేసుకుంటే వరిపంట చీడపీడల నుంచి రక్షింపబడతుందనీ, అధిక దిగుబడి వస్తుందనే విశ్వాసంతో రైతులు వుంటారనీ, కాబట్టీ వారికి నీరు అందించడానికి ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలని సీఎం సూచించారు.

కృష్ణాబేసిన్ లో ప్రభుత్వం ఇటీవల నిర్మించ తలపెట్టిన లిఫ్టులు, గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతి , వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలువల మరమ్మతులు, వాటి పరిస్థితి, తదితర సాగు నీటి అంశాల పై మంగళవారం నాడు సీఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు జి. జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి,మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి,ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హన్మంత్ షిండే,శానంపూడి సైదిరెడ్డి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఎం ఓస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఈఎన్సీలు హరిరామ్, వెంకటేశ్వర్లు, సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘ వేల కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నాం. వాటిని వ్యూహాత్మకంగా రైతు సంక్షేమానికి వినియోగించే విధానాలను అవలంబించాలె. ప్రాణహిత లో నీటి లభ్యతను అది ప్రవహించేతీరును అర్థం చేసుకోవాలి. ప్రాణహిత ప్రవాహం జూన్ 20 తర్వాత ఉధృతంగా మారుతుంది. అప్పడు వచ్చిన నీరును వచ్చినట్టే ఎత్తిపోసి కాళేశ్వరం రాడార్లో వున్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపుకోవాలె. కాల్వల మరమ్మతులు కొద్దిపాటి కొరవలు మిగిలి ఉన్నాయి. వాటిని సత్వరమే పూర్తి చేసుకొని, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేపట్టాలి. కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. రోహిణి కార్తెలో నాటేసుకుంటే చీడ పీడల బాధ ఉండదని, అధిక దిగుబడి వస్తదని రైతాంగం విశ్వసిస్తారు. ఈలోపు చెరువులు, కుంటలు నింపుకోవాలె. రైతు పండించే పంట రైతుకు మాత్రమే చెందదు. అది రాష్ట్ర సంపదగా మారుతుందనే విషయాన్ని మీరు గ్రహించాలె. మొదటి దశ కరోనా కష్టకాలంలో రైతు పండించిన పంట ద్వారా 17శాతం ఆదాయం అందించి రాష్ట్ర జీఎస్.డి.పి.లో తెలంగాణ వ్యవసాయం భాగస్వామ్యం పంచుకున్నది. రాష్ట్ర రెవెన్యూకు తెలంగాణ వ్యవసాయం వెన్నుదన్నుగా నిలిచే పరిస్థితికి నేడు తెలంగాణ అభివృద్ధి చెందింది. ఒకనాడు తెలంగాణ వ్యవసాయం దండుగ అన్నరు. చిన్నచూపు చూసిండ్రు. కానీ, నాటి సమైక్య పాలకుల దృక్పథం తప్పని నిరూపితమైంది. నేడు తెలంగాణ వ్యవసాయం దేశాన్నే ఆశ్చర్యపరిచే స్థాయికి చేరుకున్నది. ఈ విషయాలను లోతుగా అధికారులు అర్థం చేసుకుంటూ సాగునీటి రంగాన్ని మరింత విజ్ఞతతో ముందుకు నడిపించాలి. ’’ అని సిఎం అన్నారు.

‘‘ఇరిగేషన్ శాఖ కృషితో తెలంగాణ సాగునీటి రంగం, వ్యవసాయ రంగం ముఖచిత్రం మారిపోయింది. ఒక్క కాళేశ్వరం ద్వారానే నేడు 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలను పండించే స్థాయికి చేరుకున్నామంటే ఆశామాషీ కాదు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ నేడు పంజాబ్ తర్వాత రెండో పెద్ద రాష్ట్రంగా అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు తెలంగాణ వ్యవసాయాన్ని నాటి పాలకులు నిర్లక్ష్యం చేసిన ఫలితంగా రైతులు 50 వేల కోట్ల సొంత ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల బోర్లు వేసుకున్నారు. భార్యల మెడలమీది పుస్తెలమ్మి వ్యవసాయం చేసిన దీన స్థితి నాటి పరిస్థితి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నీల్లతో భూగర్భజలాలు పెరగడం వల్ల నాడు తొవ్వుకున్న బోర్లు నేడు పొంగి పొర్లుతున్నాయి. దాంతో ప్రాజెక్టు నీల్లతో సాగవుతున్న ఆయకట్టుకు సమానంగా బోర్ల ద్వారా నేడు తెలంగాణ రైతులు పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తుండడంతో సమృద్ధిగా పంటలు పండిస్తూ ప్రాజెక్టు జలాలతో తెలంగాణ బోరుబావులు స్థిరికరించబడినవి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు ఒక్క టిఎంసి కూడా దిక్కు లేదు. నేడు గోదావరి మీద కట్టుకున్న ప్రాజెక్టుల్లో గోదావరీ నదీ గర్భంలోనే 100 టిఎంసిల నీటిని నిల్వచేసుకునే స్థాయికి చేరుకున్నాం ’’ అని సిఎం వివరించారు.

రానున్న వానాకాలం సీజన్ లో చెరువులను, కుంటలను, వాగులను, చెక్ డ్యాంలను నింపడమే ప్రధాన ప్రాధాన్యతగా భావించాలని సిఎం ఇంజనీర్లకు సూచించారు. నాలుగు వేల కోట్లు పెట్టి నిర్మిస్తున్న చెక్ డ్యాంలు నీటి నిల్వను చేస్తూ అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నవి. 50 వేల చెరువులను నిరంతరం నిండుకుండల్లా నీటిని నిల్వవుంచుకోవాలని, 30 జూన్ వరకు మొదటి దశ చెక్ డ్యాంలు పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు.

ఈ నేపథ్యంలో.. ఎల్లంపల్లి నుంచి దుమ్ముగూడెం దాకా అక్టోబర్ నెలాఖరు దాకా నీటి లభ్యత వుంటుందని, వెంట వెంటనే నీటిని పంపులద్వారా ఎత్తిపోసి చెక్ డ్యాం లను, చెరువులు, కుంటలు నింపుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. తద్వారా రెండో పంటకు నీటి నిల్వలతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. కృష్ణా బేసిన్ లో కూడా ఇదే విధానాన్ని అవలంబించాలన్నారు.

అదే సందర్భంలో తాగునీటికి లోటురాకుండా చూసుకుంటూ రిజర్వాయర్లలో కనీస నీటి మట్టాన్ని కొనసాగించాలని అన్నారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రిజర్వాయర్లలో ఎం.డి.డి.ఎల్. మెయింటేన్ చేయాలని ఇరిగేషన్ అధికారలకు సిఎం సూచించారు.

      ఎస్సారెస్పీ పునరుజ్జీవనం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి చివరి ఆయకట్టు దాకా నీటికొరత లేకుండా చేశామన్నారు. హుస్నాబాద్, పాత మెదక్, ఆలేరు, భువనగిరి, జనగామలకు మల్లన్న సాగర్ వరంలా మారనున్నదని సీఎం తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా బంగారు తునకగా మారుతుందనీ, దేవాదుల ప్రాజెక్టును నూటికి నూరుశాతం వరంగల్ జిల్లాకే అంకితం చేస్తామన్నారు. ఇదే విధంగా మిగతా జిల్లాల్లోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగునీటినందించే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని అధికారులకు సూచించారు.

      కాల్వల మరమ్మతు తదితర అవసరాల కోసం ఇరిగేషన్ అధికారుల వద్ద రూ. 700 కోట్లు కేటాయించామన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాల్వల ప్రాజెక్టుల ఓఅండ్ఎం కోసం కనీసం కోటి రూపాయలను కూడా కేటాయించలేదని సిఎం గుర్తు చేశారు. రానున్న సీజన్ కూడా గేట్ల మరమ్మతులు, కాల్వల మరమ్మతులు పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలన్నారు.  ప్రాజెక్టుల నిర్మాణం, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నిధులను ఆర్థికశాఖ నుంచి విడుదల చేసి, నీటిపారుదలశాఖ  కార్యదర్శి అధీనంలో బడ్జెట్ అందుబాటులో ఉంచుతామన్నారు. ‘‘ కాళేశ్వరంలో బటన్ వత్తినం అంటే చివరి ఆయకట్టు దాకా ఎటువంటి ఆటంకం లేకుండా నీరు ప్రవహించి పొలాలకు చేరాలె. అందుకు సంబంధించి  సర్వం సిద్ధం చేసిపెట్టుకోవాలె’’ అని సిఎం అన్నారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇటీవల శంఖుస్థాపన చేసిన నెలికల్లు లిప్టుకు 24 వేల ఎకరాలకు సాగునీరు అందించే సామర్ద్యం వున్న నేపథ్యంలో పాత టెండర్ ను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని సిఎం అన్నారు.ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను వారంరోజుల్లో పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. సదర్ మాట్ బ్యారేజీ నిర్మాణం పనుల పురోగతిని సిఎం ఆరా తీసారు.

నిరంతరం లెవ్ లో, డైనమిక్ గా వుండే ఇరిగేషన్ శాఖలో ఒక్కరోజు కూడా ఏ పోస్టు కూడా ఖాళీగా వుండరాదని సిఎం స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు అర్హులకు ప్రమోషన్లు ఇస్తూ ఖాళీలను వెంట వెంటనే భర్తీ చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖకున్న ప్రత్యేకావసరాల దృష్ట్యా నియామక ప్రక్రియను బోర్డుద్వారా స్వంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలు చేస్తామని సిఎం అన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఖాళీల నివేదికను తనకు తక్షణమే అందజేయాలని సిఎం ఈఎన్సీ మురళీధర్ రావును ఆదేశించారు. కాల్వల నిర్వహణ కోసం త్వరలో లష్కర్లు, జేఈల నియామకాన్ని చేపడుతామని సిఎం తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి, వాటి పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. స్టేటస్ రిపోర్టు అందచేయాలని ఆదేశించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో సాంకేతిక బృందాన్ని పంపి బ్యారేజీ నిర్వహణకు సంబంధించి ఇంజనీర్లకు ట్రెయినింగ్ ఇవ్వాలని ఆదేశించారు.

మేజర్ లిఫ్టులు, పంపులు వున్న దగ్గర స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం చేపట్టి, తక్షణమే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కాంట్రాక్టర్ల క్యాంపుల కోసం భూసేకరణ నిలిపివేయాలన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం మూడో పంప్ హౌజ్ పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు.

మైలారం ట్యాంకునుంచి సూర్యాపేట తుంగతుర్తి దిక్కుగా కాళేశ్వరం నీటి ని తీసుకపోయే డిబిఎం 71 కాల్వ లైనింగ్ పనులను చేపట్టాలని సిఎం ఆదేశించారు. హల్దీవాగు ప్రాజెక్టు కాలువ అధునీకీకరణ పనులను చేపట్టి 7 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్నారు. తూర్పు అదిలాబాద్ లోని మంచిర్యాల కాగజ్ నగర్ బెల్లం పెల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీరందించేందుకు నిర్మాణం చేయబోతున్న లిఫ్టుల కోసం ఆయకట్టు సర్వేను చేపట్టడానికి వాప్కోస్ షంస్థ తో సంప్రదింపులు జరుపాలని సిఎం ఆదేశించారు.

మహబూబ్ నగర్ జిల్లా సంగమేశ్వర లిఫ్టు, బసవేశ్వర లిఫ్టు పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. సత్వరం డిపిఆర్ లు తయారు చేయించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా లోని సీతమ్మసాగర్ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వివరించగా, పాలేరు లింకు పుని ఎంతవరకు వచ్చిందని సీఎం అడిగి తెలుసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు పంటలతో, బంగారు తునకగా మారుతుందనీ, వచ్చే ఏడాది జూన్ కల్లా సీతమ్మ సాగర్ నిర్మాణం పూర్తిచేయాలన్నారు. ఇందుకు సంబంధించి తలెత్తె సమస్యలను ఎప్పటికప్పుడు స్మితా సభర్వాల్, శ్రీధర్ దేశ్ పాండే దృష్టికి తీసుకురావాలన్నారు. మల్లన్న సాగర్ మిగిలిన పనులను వేగవంతం చేయాలన్నారు. ఆర్మూర్, బాల్కొండ లిఫ్టుల పనుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ జిల్లా లోని బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డి కాల్వ, పిలాయి పెల్లి కాల్వల పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు.

గోదావరి, కృష్ణా బేసిన్లలో ప్రభుత్వం నిర్మిస్తున్న చిన్నా పెద్దా ప్రాజెక్టులన్నిటి పనుల పురోగతిని సిఎం పేరు పేరునా రివ్యూ చేశారు. సాధ్యమైనంత త్వరలో వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు ఎటువంటి వ్యూహాన్ని కార్యాచరణను అనుసరించాలో సిఎం ఇరిగేషన్ శాఖ అదికారులకు పదే పదే వివరించారు. సాగునీటి ప్రాధాన్యత తెలంగాణకు ఎంతగా అవసరమున్నదో మరోసారి కూలంకషంగా సిఎం విశదీకరించారు.

‘‘తెలంగాణ ఉద్యమం సాగునీరు ప్రధాన లక్ష్యంతో సాగింది. ఒక అవగాహనతో రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితో పోరాడినం. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చుకోవాలని చేసిన కృషి ఫలించింది. కోటికి పైగా ఎకరాలను సాగులోకి తెచ్చుకుంటున్నాం. ఈ నేపథ్యంలో డబ్బులకు వెనకాడబోం. సాగునీటి ప్రాజెక్టుల ఖర్చులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కరోనా నేపథ్యంలో కలిగే అసౌకర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా అధిగమిస్తాం. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులను సమకూరుస్తమని సీఎం అన్నారు.

సాగునీరు వ్యవసాయం సహా అన్ని రంగాల్లో తెలంగాణ స్వరూపం పూర్తిగా మారిపోయింది. దానికనుగుణంగా అధికారులు పనివిధానాన్ని మార్చుకోవాలి. ఓఅండ్ఎం పై జూన్ మొదటి వారంలో ఇంజనీర్ల వర్క్ షాప్ నిర్వహించాలి. ఇంజనీరింగ్ పనుల ప్రతిపాదనలను రూపొందించే ముందే జాగ్రత్తగా ఎస్టిమేషన్లు రూపొందించాలని సిఎం సూచించారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *